Mahaa Daily Exclusive

  డీఎస్సీ-2008 నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు… ఆ రిట్ పిటిషన్లు కొట్టివేత…..

Share

హైదరాబాద్, మహా .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన డీఎస్సీ-2008 ఉపాధ్యాయ నియామకాల వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 28 సవరణ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ దాఖలైన మూడు పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం.. వాటన్నింటినీ డిస్మిస్ చేస్తూ తుది తీర్పును ప్రకటించింది.
డీఎస్సీ-2008 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైన తర్వాత ప్రభుత్వం జీవో నంబర్ 28ను జారీ చేసిందని, అందులో రూల్ 7కు కొత్తగా ప్రొవిజన్‌ను (నిబంధన) జోడించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ పలువురు బీఈడీ అభ్యర్థులు గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటిఫికేషన్ వెలువడిన అనంతరం మధ్యలో నిబంధనలు మార్చడం సరికాదని వారు తమ పిటిషన్లలో ప్రధానంగా వాదించారు. 2008 డిసెంబర్‌లో విడుదల చేసిన అసలు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ వ్యవహారంపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. పిటిషనర్ల అభ్యంతరాలను తిరస్కరించింది. నిబంధనల సవరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేస్తూ, బీఈడీ అభ్యర్థులు వేసిన ఆ మూడు రిట్ పిటిషన్లను కొట్టివేసింది. ఉన్నత న్యాయస్థానం తాజా తీర్పుతో దశాబ్దానికి పైగా కొనసాగుతున్న డీఎస్సీ 2008 నియామకాల వివాదంలో ఒక స్పష్టత వచ్చినట్లయింది.