Mahaa Daily Exclusive

  అర్నబ్ తుఫాన్ నష్టం అపారం…

Share

  • అర్నబ్ తుఫాన్ నష్టం అపారం
  • అంచనాకు వెంటనే ఏపీకి కేంద్ర బృందాలను పంపండి
  • అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ

అమరావతి, మహా : అత్యంత తీవ్ర తుపాను అర్నబ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. నష్ట తీవ్రతను ప్రత్యక్షంగా పరిశీలించి అంచనా వేసేందుకు త్వరలోనే కేంద్ర అధ్యయన బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని సీఎం చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ముందస్తు చర్యల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అర్నబ్ తుపాను ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి 28,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ఎన్ డిఆర్ఎప్, 11 ఎస్ డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించినట్లు వెల్లడించారు. అత్యవసర సేవలు, సహాయక చర్యలు రాత్రంతా కొనసాగాయని స్పష్టం చేశారు. సుమారు 70,900 హెక్టార్లలో వరి సహా ఇతర వ్యవసాయ పంటలు, మరో 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగినట్లు లేదా దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశామన్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఇళ్లకు ఆస్తి నష్టం వాటిల్లింది. రాష్ట్ర రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోగా, వాటిలో 170కి పైగా చెట్లను తొలగించగా.. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. తీరప్రాంత జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. అయితే విద్యుత్ పునరుద్ధరణ, రహదారులపై చెట్ల తొలగింపు, తాగునీటి సరఫరా పునరుద్ధరణకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, అనకాపల్లి జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. అర్నబ్ తుపాను ద్వారా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర బృందాన్ని త్వరగా పంపించాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఎన్ డీఆర్ఎఫ్ సహా ఇతర కేంద్ర సంస్థల సహకారాన్ని కొనసాగించాలని అమిత్ షాకి ఆయన విజ్ఞప్తి చేశారు.