- ఏసీబీకి చిక్కిన ఇన్‌స్పెక్టర్
- యాదాద్రి కలెక్టరేట్‌లో ఏసీబీ దాడి
- పెట్రోల్ బంకు అనుమతులకు లంచం..
- రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టివేత
యాదాద్రి, మహా : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అధికారిని పట్టుకున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌లో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పెట్రోల్ బంకు అనుమతుల వ్యవహారంలో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పెట్రోల్ బంకు అనుమతులకు సంబంధించిన పనిని పూర్తి చేసేందుకు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మొదటి విడతగా రూ.20 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ డబ్బు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పట్టుకున్నారు.
జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేయడంతో అక్కడ కలకలం నెలకొంది. లంచం తీసుకుంటున్న అధికారిని పట్టుకోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపడుతున్నారు. లంచం డిమాండ్ చేసిన పరిస్థితులు, అనుమతుల వ్యవహారంలో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే అంశాలపై పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.








