Mahaa Daily Exclusive

  మంజీరా నదిలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి..

Share

  • మంజీరా నదిలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి
  • ఆర్థిక ఇబ్బందులే కారణమా?
  • చిన్న ఘనపూర్‌ బ్రిడ్జి సమీపంలో మృతదేహాల వెలికితీత

మెదక్‌, మహా : మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంజీరా నదిలో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. బుధవారం ఉదయం చిన్న ఘనపూర్‌ శివారులోని మొదటి బ్రిడ్జి సమీపంలో వారి మృతదేహాలను కొల్చారం పోలీసులు వెలికితీశారు. తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

భర్త మృతితో కుటుంబ బాధ్యతలు…

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన గంగోల్ల సరిత (27)కు వైష్ణవి (7), సాన్విక (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సరిత భర్త గతంలోనే మృతిచెందడంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆమెపైనే పడ్డాయి. పిల్లలను తల్లిగారి ఇంట్లో ఉంచి, హైదరాబాద్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం సాగించేది. అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి కుమార్తెలను చూసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేది.

ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన…?

కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో సరిత తీవ్ర మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు. పిల్లలను తాను పనిచేసే చోట ఉంచుకోలేకపోవడం, మరోచోట వదిలి వెళ్లాల్సి రావడంపై ఆవేదన చెందేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో కుటుంబ సమస్యలతో ఒత్తిడికి లోనైనట్లు వివరించారు. అయితే ఈ అంశాలపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఆధార్‌ సవరణ పేరుతో పిల్లలను తీసుకెళ్లి

ఆధార్‌ కార్డులో సవరణ చేయించుకోవాలని చెప్పి సరిత తన తల్లి వద్ద ఉన్న ఇద్దరు కుమార్తెలను తీసుకెళ్లినట్లు బంధువులు వెల్లడించారు. అనంతరం ఏడుపాయలకు చేరుకున్న ఆమె.. పిల్లలతో కలిసి మంజీరా నదిలోకి వెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం చిన్న ఘనపూర్‌ శివారులోని మొదటి బ్రిడ్జి సమీపంలో ముగ్గురి మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. కొల్చారం ఎస్‌ఐ మయినుద్దీన్‌ మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మల్కాపూర్‌ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.