Mahaa Daily Exclusive

  స్పెయిన్‌లో ఘోర ప్రమాదం…

Share

  • స్పెయిన్‌లో ఘోర ప్రమాదం
  • రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొని 46 మంది దుర్మరణం!
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారుల వెల్లడి

ఇంటర్నెట్ డెస్క్, మహా : స్పెయిన్‌లోని టోలెడో సమీపంలో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. రెండు ప్రయాణికుల హైస్పీడ్ రైళ్లు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో 46 మంది అక్కడికక్కడే మరణించగా.. దాదాపు 300 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో రెన్ఫే, ఇరియో సంస్థలకు చెందిన రెండు రైళ్లు మోరా, ఓర్గాజ్ పట్టణాల మధ్య ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ భయానక ధాటికి ఇరియో రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పి తుక్కుతుక్కయ్యాయి. బోగీల శకలాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాద తీవ్రత చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సమీపంలోని ఉర్దా మేయర్ మాన్యుయెల్ గాలన్ ఆదేశాలతో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు స్థానిక స్పోర్ట్స్ హాల్‌ను తాత్కాలిక వైద్య శిబిరంగా మార్చారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా మాడ్రిడ్ నుంచి దక్షిణ అండలూసియా ప్రాంతాన్ని కలిపే హైస్పీడ్ రైలు మార్గాన్ని రైల్వే ఆపరేటర్ ఆదిఫ్ పూర్తిగా నిలిపివేసింది. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.