Mahaa Daily Exclusive

  మత్తుకు కాదు… కలలకు ఊపిరి పోయండి….

Share

  • మత్తుకు కాదు
  • కలలకు ఊపిరి పోయండి
  • 2029 నాటికి నషా ముక్త్‌ తెలంగాణే లక్ష్యం: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా
  • ‘నషా ముక్త్‌ భారత్‌’, ‘నషా ముక్త్‌ యువా ఫర్‌ వికసిత్‌ భారత్‌–2047’ అవగాహన కార్యక్రమంలో గవర్నర్‌

హైదరాబాద్, మహా : యువత తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని, మాదకద్రవ్యాల మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా సూచించారు. డ్రగ్స్‌ మహమ్మారి నుంచి యువతను కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. 2029 నాటికి తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్‌ ఆడిటోరియంలో బుధవారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ శాఖ, ఓయూ ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘నషా ముక్త్‌ భారత్‌’, ‘నషా ముక్త్‌ యువా ఫర్‌ వికసిత్‌ భారత్‌–2047’ అవగాహన కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొని ప్రసంగించారు. మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో విద్యార్థులు, యువత ముందుండాలని కోరారు.

విద్యాసంస్థల్లోనే ప్రతిజ్ఞ చేయించాలి

పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశం పొందే సమయంలోనే విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించే విధానాన్ని తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు గవర్నర్‌ తెలిపారు. యువతలో చిన్న వయసు నుంచే డ్రగ్స్‌పై అవగాహన పెంచడం ద్వారా వ్యసనాల బారిన పడకుండా కాపాడవచ్చన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని, యువత ఆరోగ్యంగా, లక్ష్యసాధన పట్ల నిబద్ధతతో ఉన్నప్పుడే వికసిత్‌ భారత్‌, వికసిత్‌ తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అలవాటు ఒక్క వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారిని అవమానించడం లేదా సమాజానికి దూరం పెట్టడం సరికాదని గవర్నర్‌ అన్నారు. వారికి వైద్యం, కౌన్సెలింగ్‌, కుటుంబ సభ్యుల సహకారం అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు. ‘మాదకద్రవ్యాలపై పోరాడాలి.. వ్యసనానికి గురైన వ్యక్తిపై కాదు’ అనే దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తూ, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతోపాటు దేశ అభివృద్ధికి తోడ్పడటం యువత బాధ్యతని పేర్కొన్నారు.

నవంబర్‌ 14 నుంచి 60 రోజుల ప్రత్యేక కార్యక్రమం

మాదకద్రవ్యాల ప్రమాదాలపై విద్యార్థులు, యువతలో అవగాహన పెంచేందుకు నవంబర్‌ 14 బాలల దినోత్సవం నుంచి జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం వరకు 60 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గవర్నర్‌ వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సదస్సులు, ప్రదర్శనలు, కౌన్సెలింగ్‌ కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను యువతకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించాలని, ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విద్యాసంస్థలను గుర్తించి ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థలు విద్యను అందించడంతోపాటు నైతిక విలువలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించే కేంద్రాలుగా ఉండాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభమైన చైతన్యం రాష్ట్రంలోని ప్రతి పాఠశాల, కళాశాల, గ్రామం, ఇంటికి చేరాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి అవగాహన రాయబారిగా మారి తన తోటి విద్యార్థులను, స్నేహితులను కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు.

రెడ్‌క్రాస్‌ సభ్యత్వం 1.28 లక్షలకు పైగా

తెలంగాణలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యకలాపాల విస్తరణపై గవర్నర్‌ వివరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 32 జిల్లా శాఖలకు నిర్వహణ కమిటీ ఎన్నికలు పూర్తయ్యాయని తెలిపారు. రెడ్‌క్రాస్‌ సభ్యత్వం 1.28 లక్షలు దాటిందని, జూనియర్‌ రెడ్‌క్రాస్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ విభాగాల్లో 16 లక్షలకు పైగా నమోదు జరిగిందని పేర్కొన్నారు.ఆపద మిత్ర కార్యక్రమంలో 6,000 మంది నమోదు కాగా, మై భారత్‌ పోర్టల్‌లో 5.20 లక్షలకు పైగా యువత పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో 2,000 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ఆపద మిత్ర కార్యక్రమంలో చేరడాన్ని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు.

యువత భాగస్వామ్యంతోనే నషా ముక్త్‌ భారత్‌

గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఆర్‌సీఎస్‌ తెలంగాణ శాఖ ఛైర్మన్‌ ఎం. దానకిశోర్‌ మాట్లాడుతూ.. గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. జిల్లాల పర్యటనలు, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.తెలంగాణలో రెడ్‌క్రాస్‌ సభ్యుల సంఖ్య సుమారు 40 వేల నుంచి 1.28 లక్షలకు పెరిగిందని, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో విద్యార్థుల భాగస్వామ్యం కూడా విస్తరించిందని వివరించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు.

కార్యక్రమంలో గవర్నర్‌ నషా ముక్త్‌ భారత్‌ పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. విద్యార్థులు, యువతతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను ప్రోత్సహించారు. అనంతరం ఠాగూర్‌ ఆడిటోరియం నుంచి ఆర్ట్స్‌ కాలేజీ వరకు విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, రెడ్‌క్రాస్‌ సభ్యులతో నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞలు, ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం, గవర్నర్‌ సంయుక్త కార్యదర్శి కొమండూరు శశికిరణ్‌, ఐఆర్‌సీఎస్‌ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాములు, అధ్యాపకులు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటమే కాకుండా, ఇతరులను కూడా ఆ దిశగా ప్రోత్సహించాలని గవర్నర్‌ యువతకు పిలుపునిచ్చారు. ‘మత్తుకు నో చెప్పండి.. జీవితానికి అవును చెప్పండి’ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమష్టి కృషితో తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.