Mahaa Daily Exclusive

  ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా పనిచేశాం..

Share

  • ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా పనిచేశాం
  • అధికార యంత్రాంగం, సిబ్బంది వేగంగా స్పందించారు
  •  బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తాం
  • తుఫాన్ నష్టంపై కేంద్రానికి నేడు ప్రాథమిక నివేదిక
  • సహాయక చర్యల్లో సాంకేతికతతో సత్ఫలితాలు
  • ఆర్టీజీఎస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు

 

అమరావతి, మహా : అర్నబ్ తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేస్తూ, మూడు రోజుల్లో ఏడు సమీక్షలు నిర్వహించి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించ గలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా తుఫాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించామని చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదని స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలకు అత్యంత ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల వరకు అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేశారని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు, షెల్టర్ క్యాంపులకు తరలించడంతో పాటు, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించామని చెప్పారు. రెస్క్యూ, రిలీఫ్ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. పంట నష్టాన్ని మినహాయించి, ఇతర నష్టాలకు సంబంధించి అర్హులైన బాధితులకు గురువారం నుంచే ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ అంశంపై గురువారం వర్చువల్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తుఫాను వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడి తుఫాను తీవ్రత, రాష్ట్రంపై దాని ప్రభావాన్ని వివరించినట్లు చెప్పారు. కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, సమగ్ర నష్ట నివేదికను కూడా త్వరలోనే కేంద్రానికి పంపిస్తామని వెల్లడించారు.

 

సాంకేతికతతో కచ్చితమైన అంచనాలు

 

తుఫాను ప్రభావంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయని, పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు కూలిపోయినట్లు తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోనూ ఎల్లుండి సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర రహదారులు, రహదారుల పై రాకపోకలను బుధవారం రాత్రికే పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహారం, ఔషధాలు అందించేందుకు డ్రోన్లను కూడా సిద్ధం చేశామని వివరించారు. గతంలో తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సి వచ్చేదని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో తుఫాను ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో ముందుగానే గుర్తించి, అక్కడే అధికార యంత్రాంగాన్ని మోహరిస్తున్నామని వివరించారు. ప్రిడిక్షన్, యాక్యురెసీ, క్షేత్రస్థాయిలో అప్రమత్తత అనే విధానాలతో విపత్తును ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఐఎండీ సమాచారం, ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తుఫాను గమనాన్ని అంచనా వేశామని చెప్పారు. సముద్రంలో నెలకొన్న వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా తుఫాను ఏపీ తీరంపై సుమారు 10 గంటలపాటు నిలిచిపోయిందని, తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వెల్లడించారు. సుమారు 30 వేల మంది క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం సమన్వయం చేసుకున్నామని తెలిపారు.

 

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

 

తుఫాను ప్రభావంతో విశాఖపట్నంలో విద్యుత్‌పై చెట్టు కూలిన ఘటనలో ఇద్దరు, అనకాపల్లిలో ఒకరు, కోనసీమలో ఒకరు, భీమవరంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. తుఫాను కారణంగా ఇళ్లు, పంటలు, దుకాణాలు, ఇతర ఆస్తులు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన బాధితులకు 25 కిలోల బియ్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యంతో పాటు కిలో చొప్పున ఉల్లి, వంటనూనె, కందిపప్పు అందిస్తామని ప్రకటించారు. షెల్టర్ క్యాంపుల్లో ఆశ్రయం పొందిన వారికి రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఉద్యాన పంటలకు సంబంధించి అరటి పంటకు హెక్టారుకు రూ.35,000, టమాటాకు రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. పత్తి, చెరకు తదితర పంటలకు హెక్టారుకు రూ.25,000 చొప్పున సాయం అందించే అంశాన్ని వెల్లడించారు. ఇతర పంటలకు నష్టం కేటగిరీల వారీగా పరిహారం అందిస్తామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టాన్ని ఎన్యుమరేషన్ ద్వారా అంచనా వేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు.

 

ప్రభావిత ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన

 

అర్నబ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో వర్షపాతం పెరిగిందని సీఎం తెలిపారు. రాష్ట్ర సగటు లోటు వర్షపాతం 39 శాతం నుంచి 27 శాతానికి తగ్గిందని చెప్పారు. విశాఖపట్నంలో 21 సెంటీమీటర్లు, విజయనగరంలో 18 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలో 14 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని వివరించారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకు నేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏ చెరువును నింపాలి, ఏ రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించాలన్న అంశాలపై కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ముందస్తు చర్యలు, కాలువల్లో అడ్డంకులను తొలగించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఒక్క చెరువుకు కూడా గండి పడలేదని చెప్పారు. శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో మరికొంత వర్షం కురిసే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలను అప్రమత్తం చేశామని వెల్లడించారు. గత మూడు రోజులుగా నిరంతరం పనిచేసిన అధికారులు, జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. తాను, అధికారులు, సిబ్బంది రాత్రంతా నిద్ర లేకుండా ప్రజలకు సేవలందించామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తూ ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించారని పేర్కొన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను కొనసాగించాలని సూచించారు. గురువారం స్వయంగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బాధితులకు వేగంగా సహాయం అందించి, ప్రజల్లో భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.