- కాలుష్యం కబలిస్తోంది
- ఢిల్లీతో పోటీపడుతున్న హైదరాబాద్
- నగరంలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం
- ఐటీ కారిడార్ లో విషతుల్య గాలి
హైదరాబాద్, మహా : హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్యం వణికిస్తోంది. ఒకప్పుడు స్వచ్ఛమైన వాతావరణానికి పేరొందిన నగరం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీని తలపించేలా హైదరాబాద్‌లోనూ గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని పలు ప్రాంతాలు కాలుష్య హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. శేరిలింగంపల్లి, మణికొండ, గచ్చిబౌలి పరిసరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. కాలుష్య గణాంకాల ప్రకారం హైదరాబాద్ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 410గా నమోదైంది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య పరిస్థితిని సూచిస్తోంది. సాధారణంగా పీఎం 2.5కు సూచించిన సురక్షిత పరిమితి 60 మైక్రోగ్రాములు కాగా.. ప్రస్తుతం 278 మైక్రోగ్రాములకు చేరింది. అలాగే పీఎం 10 సురక్షిత పరిమితి 100 మైక్రోగ్రాములు కాగా.. 326 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఈ స్థాయిలో సూక్ష్మ ధూళి కణాలు గాలిలో ఉండటం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే డిఫెన్స్ కాలనీలో ఏకంగా 685 ఏక్యూఐ నమోదైంది. శేరిలింగంపల్లిలో 666, మణికొండలో 602, యాంబియన్స్ ఫోర్ట్‌లో 596, ఎన్‌బీటీ నగర్‌లో 582గా కాలుష్య సూచీ నమోదైంది. ముఖ్యంగా ఐటీ సంస్థలు, భారీ నిర్మాణాలు, నిరంతర వాహన రాకపోకలు ఎక్కువగా ఉండే పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్ రద్దీ, నిర్మాణ కార్యకలాపాల నుంచి వెలువడే దుమ్ము, వాహనాల పొగ, పారిశ్రామిక ఉద్గారాలు గాలి నాణ్యతపై ప్రభావం చూపే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
శ్వాసకోశ బాధితులకు వైద్యుల హెచ్చరిక
వాయు కాలుష్యం పెరగడంతో ఆస్తమా, బ్రాంకైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యలున్నవారికి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. దగ్గు, గొంతులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ల మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యం తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లడం, రోడ్లపై వ్యాయామాలు చేయడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే బాగా సరిపోయే ఎన్ 95 మాస్క్ ధరించడం మంచిది సూచిస్తున్నారు.
నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, నిర్మాణ రంగ కార్యకలాపాలు, రోడ్లపై పేరుకుపోయిన దుమ్ము వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రోడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టడం, వాహన ఉద్గారాల తనిఖీలు ముమ్మరం చేయడం వంటి చర్యలు కీలకం. హైదరాబాద్ గాలి నాణ్యత మరింత దిగజారకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.








