- డీపీఆర్ లేకుండానే టెండర్లా
- ఇది తుగ్లక్ పాలన కాకుంటే మరేంటి..?
- మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు అమలు తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎలాంటి ముందుచూపు లేకుండా, ప్రజలకు నష్టం జరిగేలా చర్యలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. తాజాగా.. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన తీరుతోపాటు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం కాకుండానే టెండర్లు పిలవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు లేకుండానే పబ్లిక్ హియరింగ్ నిర్వహించారని, డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు బిడ్లను ఆహ్వానించారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలు, ప్రాజెక్టు సమగ్ర వివరాలు లేకుండా ఇంత భారీ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, నీటి సమస్యలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంటూ, ఇలాంటి సమయంలో సుందరీకరణ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ప్రజల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తున్నారని ఆరోపించారు. “ప్రజలు లేకుండా పబ్లిక్ హియరింగ్.. డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు బిడ్లు పిలవడం.. ఇందులో విడ్డూరం ఏంటంటే, రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ‘సుందరీకరణ’ పేరుతో హడావుడి చేయడం. ఇది తుగ్లక్ ప్రభుత్వం కాకపోతే మరేం అనాలో అర్థం కావడం లేదు” అంటూ కేటీఆర్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు.
మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశంగా మారింది. అయితే ప్రాజెక్టు వ్యయం, అమలు ప్రణాళిక, పునరావాసం, పర్యావరణ ప్రభావం, ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలపై రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రాజెక్టు వివరాలు, టెండర్ల ప్రక్రియపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. అయితే ఆయన చేసిన ఆరోపణలపై ప్రభుత్వ స్పందన ఏవిధంగా ఉంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.








