Mahaa Daily Exclusive

  ఎన్నికల వరకే రాజకీయాలు….

Share

  • ఎన్నికల వరకే రాజకీయాలు
  • కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్‌తో కలిసి పనిచేస్తాం
  • మంత్రి పొన్నం

కరీంనగర్, మహా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రయోజనాలు, జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులంతా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 నుంచి 90 శాతం వరకు పనులు పూర్తయి వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేస్తామని పొన్నం తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, గోదావరి జలసంపద వంటి వనరులు జిల్లాకు అపారమైన అభివృద్ధి అవకాశాలను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని సమర్థంగా వినియోగించుకుంటూ పారిశ్రామిక రంగం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

విద్యారంగంలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు భీమదేవరపల్లిలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేశామని, జమ్మికుంట, హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఫార్మసీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు వైద్య సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పర్యాటక, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎలగందుల ఖిల్లాతోపాటు ఇతర పర్యాటక ప్రాంతాలు, జలవనరుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామన్నారు. కరీంనగర్ నగరంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అర్బన్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం దాదాపు వెయ్యి కొత్త పోస్టుల ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కరీంనగర్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్థిక మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరినట్లు పొన్నం వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన ఉమ్మడి సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన పనులపై జర్నలిస్టులు కూడా సూచనలు చేస్తూ భాగస్వాములు కావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనన్ని నిధులు తీసుకొచ్చి ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా జిల్లా అభివృద్ధికి పాటుపడటం తన బాధ్యతని, ప్రజల ఆశీర్వాదంతో ఆ బాధ్యతను నెరవేరుస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.