Mahaa Daily Exclusive

  ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం….

Share

  • ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం
  • ఇది సుపరిపాలనకు దక్కిన గౌరవం
  • 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు
  • మెరుగైన స్ట్రైక్ రైట్
  • కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
  • అనేక జిల్లాల్లో వైసీపీకి ప్రజా మద్దతు పూర్తిగా కరువైందని వ్యాఖ్య‌

మంగళగిరి, మహా : ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన అఖండ విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రభుత్వ సుపరిపాలనకు, రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన గౌరవమని ఆయన అభివర్ణించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “మంచి పరిపాలన మంచి రాజకీయాలకు దారితీస్తుంది (గుడ్ గవర్నెన్సు లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్)” అని తాను నిరంతరం విశ్వసిస్తానని, ఆ నమ్మకాన్ని ప్రజలు మరోసారి నిజం చేశారని అన్నారు.

2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే, స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజల ఆదరణ మరింతగా పెరిగిందని చంద్రబాబు విశ్లేషించారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరింతగా తిరస్కరించారని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా, వర్గాలకు అతీతంగా ప్రజలంతా కూటమి వైపే నిలిచారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ పేపర్ అయినా, పోస్టల్ బ్యాలెట్ అయినా.. ప్రజలు కూటమికే మద్దతు పలికారని తెలిపారు. ముఖ్యంగా అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పలనాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీకి ప్రజా మద్దతు పూర్తిగా కరువైందని ఆయన పేర్కొన్నారు. తుపాన్ల వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిందని, తాము పడిన కష్టాన్ని ప్రజలు గుర్తించారని చంద్రబాబు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించారని అన్నారు.

ఈ చారిత్రక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆయన వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో కూటమికి 55.30 శాతం ఓట్లు రాగా, అప్పుడు వైసీపీకి 39.81 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల వ్యత్యాసం 15.9 శాతం ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 58.90 ఓట్లు రాగా, వైసీపీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీకి ఓట్ల శాతం తగ్గగా, కూటమి మెజారిటీ 25.34 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నారు. క్లియర్‌గా ప్రజలు ఏ విధంగా స్పందిచారో చెప్పేందుకు ఈ ఫలితాలు నిదర్శనం అన్నారు.

పట్టణాల్లో 59.9 శాతం కూటమికి రాగా, 34.3 శాతం ఓట్లు వచ్చాయి. పరిషత్ ఎన్నికల్లో కూటమికి వైసీపీ 25.56 శాతం ఓట్ల వ్యత్యాసం ఉందన్నారు. జెడ్పీటీసీల్లో 57.6 శాతం, వైసీపీకి 39.7 శాతం రాగా, వ్యత్యాసం 17.9 శాతం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ స్పష్టంగా ఎన్డీయే కూటమి ఆధిపత్యం చెలాయించిందన్నారు. అప్పుడు స్ట్రైక్ రేట్ 94 శాతం కాగా, స్థానిక ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ 87.5 శాతం వచ్చింది. ఎంపీటీసీలు మొత్తం 9818 స్థానాలకుగానూ కూటమి 7803, ఎంపీపీలో 90 శాతంపైనే కూటమి అభ్యర్థులు నెగ్గారు. జెడ్పీటీసీలు 659 స్థానాల్లో 575 కూటమి నెగ్గింది. మొత్తం 28 జిల్లాలకుగానూ అల్లూరి జిల్లా మినహా 27 జిల్లాల్లో పూర్తిస్థాయి మెజారిటీ వచ్చిందని తెలిపారు. జెడ్పీటీసీల్లో వైసీపీ 7 జిల్లాల్లో ఖాతా తెరవలేదు. అందులో అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

పోస్టల్ బ్యాలెట్లతో స్పష్టమైన తీర్పు

ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లు వేశారు. 65.70 శాతం ఓట్లు, వైసీపీకి 27.42 శాతం 38.28 శాతం వ్యత్యాసం ఉందన్నారు. పరిషల్ ఎన్నికల్లో ఎన్డీయేకు 68.3 శాతం ఓట్లు కాగా, వైసీపీకి 31.43 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓట్ల వ్యత్యాసం సైతం చాలానే ఉందని చంద్రబాబు తెలిపారు. ఈవీఎంలు పెడితే ట్యాంపరింగ్ అని ఆరోపించారు. ఇప్పుడు బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తే.. రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బంది సైతం స్పష్టంగా ఎన్డీయే కూటమికి ఓట్లు వేసి మా పాలనకు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. తుపాన్ల సమయంలోనూ ప్రభుత్వం ఎన్నికల కంటే ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇచ్చిందని, అందుకే సుపరిపాలనకు ఈ ఎన్నికల్లో గౌరవం దక్కిందన్నారు.

తప్పులు ఉంటే సరిచేసుకుంటూ ముందుకు వెళ్తామని, వైసీపీకి ఓట్లు వేసేందుకు ప్రజలు ఇష్టపడలేదన్నారు. అయితే కూటమికి, లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. ఏజెన్సీల అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై సైతం ప్రభుత్వం ఫోకస్ చేసిందన్నారు.