- ఒకే విడతలో సహకార ఎన్నికలు
- ఏపీ ప్రభుత్వం కసరత్తు
- అందుబాటులో ఉన్న 2050 పీఏసీఎస్ లు
అమరావతి, మహా : సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్) వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికీ విడతలవారీగా కాకుండా, ఒకే విడతలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధారణంగా సహకార ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనాపరమైన చిక్కులను అధిగమించడానికి ఒకేసారి పోలింగ్ నిర్వహించడమే సరైన మార్గమని భావిస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు నిరీక్షించకుండా క్షేత్రస్థాయిలో ముందస్తు సన్నాహక చర్యలు వెంటనే ప్రారంభించాలని సహకార శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా రూపకల్పన, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ప్రాథమిక ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల సన్నాహాలకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదికను రాబోయే పది రోజుల్లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారుల నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ను ఆఖరి రూపానికి తీసుకురానున్నారు.
జనవరిలో ఎన్నికలు….?
ప్రభుత్వ యోచన ప్రకారం వచ్చే ఏడాది జనవరి నెలలో ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సహకార ఎన్నికలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అత్యంత కీలకమైన పీఏసీఎస్ పాలకవర్గాలు ఏర్పాటు కావడం ద్వారా వ్యవసాయ రుణాలు, ఎరువుల పంపిణీ మరియు ఇతర సహకార సేవలు మరింత పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయని రైతులు భావిస్తున్నారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికలకు ప్రభుత్వం ముందడుగు వేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా కూడా వేడి రాజుకునే అవకాశం ఉంది.








