Mahaa Daily Exclusive

  దీపావళి వేళ… హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు..

Share

  • దీపావళి వేళ
  • హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు
  • భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణనష్టం

హైదరాబాద్, మహా : దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు. ఒకవైపు పటాకుల మోతలతో నగరం హోరెత్తుతుంటే, మరోవైపు ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. కూకట్‌పల్లిలోని ఆస్ బెస్టాస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఒక పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా పక్కనే ఉన్న నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్ స్టాక్ గోదాములకు విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. సీతాఫల్‌మండిలో బాణసంచా కాల్చే సమయంలో ఒక రాకెట్ నేరుగా బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లడంతో షాపులోని క్రాకర్స్ అన్నీ ఒక్కసారిగా పేలి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో రోడ్డుపై ఉన్న ప్రజలు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు.

కాటేదాన్ లోని ఒక పరిశ్రమలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న ప్లైవుడ్ తయారీ కేంద్రానికి వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే ఈ పరిశ్రమలకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు వెల్లడించారు. బేగంబజార్‌లోని ఒక భవనంపై బాణసంచా నిప్పులు పడటంతో మంటలు చెలరేగాయి. జీడిమెట్లలోని ఒక స్క్రాప్ దుకాణంలో బాణసంచా వల్ల మంటలు వ్యాపించి షాపు పూర్తిగా ఆహుతైంది. మైలార్‌దేవ్‌పల్లి ఓల్డ్ విలేజ్‌లోని డెకరేషన్ గోదాంలో, అలాగే సికింద్రాబాద్ బండిమెట్‌లోని డిస్ట్రిబ్యూటర్ డ్రగ్ మార్ట్‌లో అగ్నిప్రమాదాలు సంభవించాయి.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదాలన్నింటిలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదాలు తప్పాయి.

56 మందికి కంటి గాయాలు

దీపావళి పండుగ వేళ బాణసంచా కాల్చుతూ పలువురు ప్రమాదాలకు గురయ్యారు. కంటి గాయాలతో బాధితులు సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చేరారు. బాణసంచా పేల్చుతూ 48 మంది కంటి గాయాలతో ఆస్పత్రికి వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. వీరిలో 38 మంది అవుట్ పేషెంట్, మరో 10 మంది ఇన్ పేషెంట్లుగా జాయిన్ అయ్యారు. సోమవారం మరో ఎనిమిది మంది ఆస్పత్రికి రావడంతో గాయపడ్డ వారి సంఖ్ 56 కు చేరుకుంది.