Mahaa Daily Exclusive

  రామప్ప ఆలయం సమీపంలో బొగ్గు తవ్వకాలు…..

Share

  • రామప్ప ఆలయం సమీపంలో బొగ్గు తవ్వకాలు
  • ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం
  • 5 ప్రభుత్వ సంస్థలకు నోటీసులు!

ములుగు, మహా : ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం సమీపంలో ప్రతిపాదించిన బొగ్గు గని ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) కీలక చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల చారిత్రక ఆలయంతో పాటు రామప్ప చెరువు పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తా కథనాలను సుమోటోగా స్వీకరించింది. పర్యావరణ, వారసత్వ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టేందుకు కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో సంబంధిత ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. దీంతో రామప్ప ఆలయం సమీపంలో సింగరేణి చేపట్టాలని భావిస్తున్న బొగ్గు గని ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఎన్జీటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు డాక్టర్‌ అఫ్రోజ్‌ అహ్మద్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 4వ తేదీన ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించింది. అక్టోబర్‌ 5వ తేదీన ప్రచురితమైన వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకుని ఒరిజినల్ అప్లికేషన్ నంబర్ 594/2026 కింద కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ములుగు జిల్లా కలెక్టర్‌, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం, కేంద్ర భూగర్భ జలాల ప్రాధికార సంస్థలను ప్రతివాదులుగా చేర్చింది. ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ నిబంధనల అమలు, చట్టపరమైన అనుమతుల వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

తదుపరి విచారణకు కనీసం వారం రోజుల ముందే సంబంధిత అధికారులు తమ సమాధానాలను సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లాయర్ లేకుండా నేరుగా సమాధానం దాఖలు చేసే ప్రతివాదులు విచారణ సమయంలో వర్చువల్‌గా హాజరై ట్రైబ్యునల్‌కు సహకరించాలని పేర్కొంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్) ప్రతిపాదించిన బొగ్గు గని ప్రాజెక్టులో భాగంగా రామప్ప చెరువుకు సుమారు 300 మీటర్ల దూరంలోనే తవ్వకాలు చేపట్టే అవకాశం ఉందని వార్తా కథనాల్లో పేర్కొన్నారు. ఈ అంశం పర్యావరణవేత్తలు, వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నవారిలో ఆందోళనకు కారణమైంది.

భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్‌ఐ) ప్రస్తావించిన అంశాలు కూడా ఈ ఆందోళనను పెంచుతున్నాయి. చెరువులో నీటి మట్టంలో వచ్చే మార్పులు, అక్కడి భౌగోళిక నిర్మాణాలు, భూమిలోని పగుళ్లు, రేఖీయ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల ప్రవాహంపై ప్రభావం చూపే అవకాశం ఉందని కథనాల్లో పేర్కొన్నారు. ఈ పరిణామాలు సమీపంలోని ప్రతిపాదిత గని ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది పరిశీలించాల్సిన అంశంగా మారింది. కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి సుమారు 800 ఏళ్ల చరిత్ర ఉంది.

యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఈ ఆలయం ప్రత్యేకమైన ఇసుక ఆధారిత పునాది నిర్మాణంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఆలయ నిర్మాణంలో ఇప్పటికే కొంత అరుగుదల, దెబ్బతినే లక్షణాలు కనిపిస్తున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సమీపంలో భారీ స్థాయిలో బొగ్గు తవ్వకాలు చేపడితే ఆలయ పునాదులు, నిర్మాణ స్థిరత్వం, చెరువు నీటి వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంశాలపై పర్యావరణవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, సింగరేణి సంస్థ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు గత నెలలో వచ్చిన కథనాలు వెల్లడించాయి.

ఈ వ్యవహారం ఎన్జీటీ దక్షిణ ప్రాంతీయ బెంచ్‌ పరిధిలోకి వస్తుందని భావించిన ప్రధాన ధర్మాసనం కేసును అసలు రికార్డులతో సహా చెన్నైలోని సదరన్ జోనల్ బెంచ్‌కు బదిలీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 21వ తేదీకి వాయిదా వేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ఉల్లంఘన జరిగి ఉండవచ్చనే అంశంతో పాటు, పర్యావరణ నిబంధనల అమలుపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎన్జీటీ అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఆధారంగా చేసుకుని సుమోటో విచారణ ప్రారంభించింది. తాజా విచారణలో సంబంధిత శాఖలు సమర్పించే అఫిడవిట్లు కీలకం కానున్నాయి. రామప్ప ఆలయం, చెరువు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ప్రాజెక్టు విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.