Mahaa Daily Exclusive

  హైదరాబాద్ లో మెఘా క్లైమేట్ కాంక్లేవ్…

Share

  • హైదరాబాద్ లో మెఘా క్లైమేట్ కాంక్లేవ్
  • డిసెంబర్ 7 నుంచి ప్రపంచ పర్యావరణ దిగ్గజాల సందడి!
  • ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ
  • అంతర్జాతీయ వాతావరణ నిపుణులకు ఆహ్వానం
  • హరిత పెట్టుబడులు, నీటి భద్రతపై కీలక చర్చలు

హైదరాబాద్, మహా : ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, హరిత పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో మెగా క్లైమేట్ కాన్‌క్లేవ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యావరణ నిపుణులు, ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ – గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.

ఎల్‌నినో ముప్పుపై ప్రత్యేక దృష్టి

రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులను తెలంగాణ ముందుగానే అంచనా వేసుకుని సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. దీర్ఘకాలిక కరువు, నీటి కొరత, వ్యవసాయ రంగంపై ప్రభావం, పెరిగే ఉష్ణోగ్రతలు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, పశుగ్రాసం లభ్యత, విద్యుత్ డిమాండ్, బలహీన వర్గాల రక్షణకు అవసరమైన చర్యలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వేసవి నెలల్లో కరువు నివారణ, సహాయక చర్యల కోసం ప్రతి నెలా సుమారు రూ.1,000 కోట్లు సమీకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రీయంగా, దీర్ఘకాలికంగా పనిచేసే ప్రణాళికలు అవసరమని స్పష్టం చేశారు.

పర్యావరణ దిగ్గజాలకు ఆహ్వానం

ఈ క్లైమేట్ కాన్‌క్లేవ్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పర్యావరణవేత్తలు, నిపుణులను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాజేంద్ర సింగ్, సునీతా నారాయణ్, సద్గురు, నార్వే మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హీమ్ పేర్లను ప్రతిపాదిత ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే బాలీవుడ్ నటి దియా మీర్జాను కూడా ముఖ్యంగా ప్రారంభోత్సవానికి ఆహ్వానించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. అలాగే కేంద్ర మంత్రులు, నార్వే, డెన్మార్క్, స్వీడన్ దేశాలకు చెందిన ఎంపిక చేసిన రాయబారులు, జాతీయ స్థాయి పర్యావరణ నిపుణులను కూడా ఆహ్వానించనున్నారు. సదస్సుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రముఖుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు.

హరిత పెట్టుబడులకు పెద్దపీట

కేవలం చర్చలకే పరిమితం కాకుండా.. పర్యావరణహిత పెట్టుబడులను ఆకర్షించే వేదికగా ఈ సదస్సును తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛమైన గాలి, పునరుత్పాదక ఇంధనం, నీటి సంరక్షణ, గ్రీన్ టెక్నాలజీ, వాతావరణ ఆర్థిక సహాయం, సుస్థిర మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలను ప్రదర్శించనున్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే విధానాలపైనా చర్చించనున్నారు. భూగర్భ జలాల పునరుద్ధరణ, క్షీణించిన భూముల అభివృద్ధి, సూక్ష్మ నీటిపారుదల, నేల సంరక్షణ, నీటి పొదుపుతో కూడిన ఉద్యానవన సాగులో విజయవంతమైన నమూనాలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయాలని మంత్రి సూచించారు. మణికొండలో చేపట్టిన భూగర్భ జలాల పునరుజ్జీవన కార్యక్రమం, కన్హా శాంతివనంలో మొక్కల పెంపకం, నేల పరిరక్షణ చర్యలను ఇందుకు ఉదాహరణలుగా ప్రస్తావించారు.

నవంబర్ 28న క్షేత్రస్థాయి సమావేశం

అంతర్జాతీయ సదస్సుకు ముందుగా నవంబర్ 28న వివిధ రంగాలకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మంత్రి ప్రతిపాదించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న రైతులు, ఇతర వర్గాల అనుభవాలు, సమస్యలు, అవసరాలను ఈ చర్చల్లో భాగం చేయాలని భావిస్తున్నారు. తద్వారా క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ సదస్సును తక్కువ సమావేశాలతో, ఎక్కువ ప్రయోజనాలు చేకూరేలా రూపొందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కరువు, ఎల్‌నినో సంసిద్ధత, నీటి భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, అటవీకరణ, ఎడారీకరణ, స్వచ్ఛమైన గాలి, పునరుత్పాదక ఇంధనం, వాతావరణ ఆర్థిక సహాయం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.సదస్సు ముగిసే సమయానికి కేవలం చర్చలే కాకుండా.. రాష్ట్రానికి ఉపయోగపడే ఆచరణాత్మక ప్రణాళికలు, పెట్టుబడి అవకాశాలు, కొలవగల ఫలితాలు రావాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.