Mahaa Daily Exclusive

  సీజ్ చేసే ముందు నోటీసులివ్వాలి….

Share

  • సీజ్ చేసే ముందు నోటీసులివ్వాలి
  • టీజీ సేఫ్ కమిషనర్ ను కలిసిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

,మహా : హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న తీరుపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఏదైనా లోపం గుర్తించిన వెంటనే హోటళ్లను సీజ్‌ చేయకుండా ముందుగా నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ మేరకు టీజీ సేఫ్ కమిషనర్‌ అవినాష్‌ మహంతిని ట్విన్‌ సిటీస్‌ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో కలిసి ఆయన కలిశారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌-2006లోని సెక్షన్‌ 32 ప్రకారం ముందుగా ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు జారీ చేయాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. హోటల్‌ యజమానులు గుర్తించిన లోపాలను సరిదిద్దుకునేందుకు తగిన సమయం ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే సస్పెన్షన్‌ వంటి కఠిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

హోటల్‌ యజమానులు పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం అందించేందుకు కట్టుబడి ఉన్నారని ఒవైసీ తెలిపారు. అయితే బిర్యానీ తయారీలో అధిక వేడి, గ్లౌజుల వినియోగం, కూరగాయల నిల్వ వంటి అంశాల్లో కొన్ని ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఒవైసీ సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేందుకు ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.