- వ్యక్తి పై కత్తితో దాడి.. పరారీలో నిందితుడు
- కేసు నమోదు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మట్టెవాడ,మహా ;
వరంగల్ సబ్ డివిజన్ మట్టివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మలగుడి, కుమ్మరి వీధిలో సోమవారం 9-11-2026 మధ్యాహ్నం సుమారు 3 20 గంటల ప్రాంతంలో సురావు సాయికుమార్ (30) అనే వ్యక్తిపై శ్రీకాంత్ అనే వ్యక్తి కత్తి, చాపత్తి (గొడ్డలి/పెద్ద కత్తి)తో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సంఘటన వివరాలు..
బాధితుడు సురావు సాయికుమార్ (30), తండ్రి: నర్సింగరావు (లేట్), వృత్తి: కూలి, నివాసం: బొమ్మలగుడి, మట్టివాడ.
సాయికుమార్ తల్లి సురావు హంసభాయి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… స్థానికంగా నివసించే ప్రవంతి (24) అనే మహిళ గత ఏడాది కాలంగా సాయికుమార్‌ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించసాగింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త శ్రీకాంత్ (24), తన భార్యతో గొడవ జరిగిన ప్రతిసారీ సాయికుమార్‌తో గొడవపడేవాడు. సాయికుమార్ పలుమార్లు తనకు ప్రవంతితో గానీ, శ్రీకాంత్‌తో గానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ, శ్రీకాంత్ మనస్సులో పగ పెంచుకుని గత ఆరు నెలలుగా సాయికుమార్ ను చంపడానికి అదను కోసం చూస్తున్నాడు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయికుమార్ వీధిలో ఒంటరిగా వెళ్తుండగా ప్లాన్ ప్రకారం శ్రీకాంత్ కత్తితో దాడి చేశాడు.
సాయికుమార్ ఎడమ ఛాతీ భాగంలో 3 చోట్ల, వీపు వెనుక భాగంలో 3 చోట్ల మరియు బొడ్డు పై భాగంలో 1 చోటుతో కలిపి మొత్తం 7 చోట్ల కత్తితో పొడిచాడు. సాయికుమార్ కిందపడిపోగానే పెద్ద చాపత్తితో తలపై కొట్టాడు.
అది గమనించి అడ్డుకోవడానికి వచ్చిన సాయికుమార్ తల్లి హంసభాయి దవడ పై కొట్టి, ఆమెను పక్కకు నెట్టివేసి శ్రీకాంత్ కత్తితో పరారయ్యాడు.
పోలీసుల చర్యలు:
సమాచారం అందుకున్న వెంటనే బ్లూకోల్ట్స్ అధికారి పీసీ 3958 ఎం. నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న సెక్టార్ ఎస్.ఐ శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడి తల్లి నుండి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మట్టివాడ పోలీస్ స్టేషన్లో క్రైం నెంబర్ 632/2026, u/s 109(1) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ కేసు విచారణ అధికారిగా ఎస్ ఐ బి శ్రీనివాస్ ను నియమించారు. పరారీలో ఉన్న నిందితుడు శ్రీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు తెలిపారు .








