- భారత్ సమ్మిట్ ముసుగులో దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు
- భారత్ సమ్మిట్ పేరుతో దేశ వ్యతిరేక శక్తులకు వేదిక కల్పించడం పై బీజేపీ ఆగ్రహం
- బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్
- వరంగల్ పోలీస్ కమిషనర్ కు బీజేపీ జిల్లా నేతల ఫిర్యాదు
హనుమకొండ, మహా;
హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్ – 2026 లో భారతదేశ సార్వభౌమాధికారానికి, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ రాజకీయ ప్రతినిధుల పై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి తో కలిసి మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపీఎస్ కు
ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన భావజాలాలు, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ధోరణులు ప్రదర్శించడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యం, దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమగ్రత వంటి అంశాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, విదేశీ ప్రతినిధులు భారతదేశం పై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యంతరకర వ్యాఖ్యలను అధికారులు తీవ్రంగా పరిగణించాలని కోరారు. సదస్సులో పాల్గొన్న ప్రతినిధుల వ్యాఖ్యలు, ప్రసంగాలు, కార్యక్రమానికి సంబంధించిన అంశాలను పరిశీలించి, చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాల హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, రాజకీయ ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం బాధాకరమని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు, అవినీతి ఆరోపణలు, కమీషన్ల వ్యవహారాల పై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
-తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని వినియోగించడం తగదని, ప్రజాస్వామ్య వ్యవస్థలను, దేశ గౌరవాన్ని కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతుందని గంట రవికుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మారెడ్డి, డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, పులి సర్వోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, జయంతి లాల్, సండ్ర మధు, రాంచంద్రరెడ్డి, పోనుగోటి వెంకట్ రావు, మందోటి మహేందర్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.







