Mahaa Daily Exclusive

  రాహుల్‌ విదేశీ పర్యటనలు కట్టిపెట్టాలి….

Share

రాహుల్‌ విదేశీ పర్యటనలు కట్టిపెట్టాలి.
* ఇలాగే కొనసాగితే మరో 30 ఏళ్లూ కాంగ్రెస్‌కు అధికారం దక్కదు.
* అమిత్‌ షా వ్యాఖ్యలు

పుణె, మహా.

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోసారి విమర్శలు గుప్పించారు. తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా అధికారంలోకి రాలేరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతుంటే.. రాహుల్‌ గాంధీ మాత్రం విమర్శలు చేయడానికే ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. పుణెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌ గాంధీ అధికారంలోకి రావాలనుకుంటే ముందుగా విదేశీ పర్యటనలను తగ్గించి, గ్రామాల్లో పర్యటించాలని అమిత్‌ షా సూచించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. అయితే తన సూచనలను రాహుల్‌ గాంధీ పట్టించుకోరని తనకు తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ ఇదే తీరును కొనసాగిస్తే మరో 30 ఏళ్ల వరకు పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని అన్నారు.

భారత్‌ సమ్మిట్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం

హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్‌ సమ్మిట్‌లో ఇటలీకి చెందిన రాజకీయ నాయకురాలు ఓటు చోరీ అంశాన్ని ప్రస్తావించడంపైనా అమిత్‌ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న కాంగ్రెస్‌ తన వైఫల్యాలను ఈ విధంగా వ్యక్తం చేస్తోందని విమర్శించారు. అందుకే దేశంలోని వామపక్షవాదులతోపాటు విదేశీ వామపక్షవాదులను కూడా ఆహ్వానించిందని ఆరోపించారు. భారత్‌ సమ్మిట్‌ పేరుతో కార్యక్రమం నిర్వహించినప్పటికీ, రాహుల్‌ గాంధీ అంతర్జాతీయ వేదికలపై దేశానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వెల్లడిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపణ

కాంగ్రెస్‌కు పదేళ్లపాటు అధికారంలో ఉండే అవకాశం లభించినప్పటికీ రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతికి పాల్పడిందని అమిత్‌ షా ఆరోపించారు. అందుకే ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరం చేశారని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అమిత్‌ షా పేర్కొన్నారు.