తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రను ఒప్పించండి.
* పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించండి.
* ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి.
ఢిల్లీ, మహా.
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతోపాటు అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పలు ప్రాజెక్టులకు పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు త్వరగా ఇప్పించాలని, రాష్ట్రానికి అదనంగా రూ.5,000 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. ఆదివారం ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో మోదీతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర సహకారం కావాలి
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని రేవంత్‌రెడ్డి ప్రధానిని కోరారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో జరిగిన సమావేశం వివరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను గ్రావిటీ ద్వారా తీర్చేందుకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు.
పెండింగ్ అనుమతులు త్వరగా ఇప్పించండి
డాక్టర్ ఎస్.జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్), సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), డిండి ఎత్తిపోతల పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినప్పటికీ పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో ప్రాజెక్టుల ద్వారా తాగునీటి ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు నేపథ్యంలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అనుమతులు మంజూరయ్యేలా చూడాలని ప్రధానిని కోరారు.
రూ.5 వేల కోట్ల అదనపు నిధులు కావాలి
రాష్ట్రానికి మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం పథకం (సాస్కీ) కింద అదనంగా రూ.5,000 కోట్లు కేటాయించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 70 నుంచి 90 శాతం వరకు పనులు పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులు మంజూరు చేస్తే కొత్త ఆయకట్టుతోపాటు ఇప్పటికే స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. తద్వారా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతాయని పేర్కొన్నారు.
సమ్మక్క సాగర్‌కు ఛత్తీస్‌గఢ్ సహకారం
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి సమర్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, గ్రామాల వివరాలను అంచనా వేసేందుకు పూర్తి నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్), బ్యాక్‌వాటర్ స్థాయిని గుర్తిస్తూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు రూ.9.88 కోట్లు చెల్లించినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) త్వరగా వచ్చేలా చూడాలని కోరారు.
నాలుగు ప్రాజెక్టులకు కేంద్ర నిధుల విజ్ఞప్తి
ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) కింద ఇంటిగ్రేటెడ్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగు ప్రాజెక్టుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి ప్రధానిని కోరారు.
ఖేలో ఇండియా ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం
హైదరాబాద్‌లో డిసెంబరులో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేసి, క్రీడల లోగో, మస్కట్ వివరాలను తెలియజేశారు. దేశవ్యాప్తంగా 7,000 మందికి పైగా యువ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని వివరించారు. ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ పోటీలు వేదికగా నిలుస్తాయని తెలిపారు.
ఖేలో ఇండియా లోగో, మస్కట్ ఆవిష్కరణ
తెలంగాణలో వచ్చే నెల 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 అధికారిక లోగో, మస్కట్‌లను ఆదివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలాదేవి తదితరులు పాల్గొన్నారు.






