- ఖర్గే, రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు హామీ ఏమైంది?
- ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్, మహా : ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని విస్మరించిందన్నారు. సెప్టెంబరు 17న వేలాది మంది సీపీఎస్ ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టి నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. సెప్టెంబరు 9న సీపీఎస్ సమస్యపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి రెండు నెలలు గడిచినా పురోగతి లేదని విమర్శించారు.
పీఆర్సీ అమలుపై స్పష్టత లేదని, పెండింగ్ కరవు భత్యం ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా నిరసన తెలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని మండిపడ్డారు. తమ హక్కుల కోసం నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తక్షణమే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని, పెండింగ్ పీఆర్సీని అమలు చేసి డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై బెదిరింపులు మానుకోవాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతో పాటు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అన్ని వర్గాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని దేవీప్రసాద్ తెలిపారు.







