- కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు
- అభయహస్తం మొండి హస్తంగా మారింది
- మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు
హైదరాబాద్, మహా : కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు కాగా, అధికారంలోకి వచ్చి ఆ పార్టీ చేస్తున్న నయవంచనకు మూడేళ్లు అవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు.. అధికారం కోసం ఎన్నికల కోసం గొప్పగా చెప్పుకున్న అభయహస్తం.. హామీలను అమలు చేయని మొండి హస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానమని, అందులో పేర్కొన్న హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని మూడేళ్ల క్రితం మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు. మూడేళ్లు గడిచినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు దిక్కులేదు. అమలు ఊసే లేదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆ అభయ హస్తం.. శూన్య హస్తం అయ్యిందని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఓట్లు వేసిన ప్రజలనే కాదు.. ఒట్లు వేసి దేవుళ్లను, పవిత్ర గ్రంథాలను సైతం మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు? అని నిలదీశారు.
మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ప్రజలకు హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ నీటి మూటగానే మిగిలిందని, ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా.. చట్టబద్ధత ఎందుకు కల్పించలేదుని ప్రశ్నించారు. ‘మేనిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి, హామీల అమలును గాలికొదిలేశారు. 6 గ్యారెంటీలు 420 హామీలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీకి తూట్లు పొడిచారు. గాంధీ పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ.. గాంధీభవన్ సాక్షిగా ఇచ్చిన హామీలు సైతం అమలు చేయలేక పోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి చూస్తే జాతిపిత మహాత్మా గాంధీ ఆత్మ కూడా క్షోభిస్తుంది. ప్రజల ఆశలను కాంగ్రెస్ నేతలు తమ మేనిఫెస్టో ద్వారా ఓట్లుగా మార్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఆశలను ఆవిరి చేశారు. హామీలు అమలు చేయకుండా మూడేళ్లుగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ సాధించిన ఘనత. కాంగ్రెస్ నేతల మాయమాటలను, నయవంచనను తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఇక మిగిలింది త్వరలోనే వారిగిన తగిన గుణపాఠం చెప్పడమేనని’ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.







