Mahaa Daily Exclusive

  ట్రంప్‌ కు బిగ్ షాక్….

Share

  • ట్రంప్‌ కు బిగ్ షాక్
  • విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట
  • వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు

న్యూయార్క్, మహా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు మరో షాక్ తగిలింది. విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, అంతర్జాతీయ జర్నలిస్టులకు ఫెడరల్ కోర్టు భారీ ఊరటనిచ్చింది. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల వీసా గడువును కుదిస్తూ ట్రంప్ తీసుకొచ్చిన వివాదాస్పద నిబంధనను యూఎస్ ఫెడరల్ జడ్జి కొట్టివేశారు. ఎఫ్-1, జె-1, ఐ (I) వీసాదారులకు కాలపరిమితిని తగ్గిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ 2026లో జారీ చేసిన నిబంధనలు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ నిబంధన అమలును నిలిపివేస్తూ సెప్టెంబర్ 14నే కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేయగా, తాజాగా తుది తీర్పు ఇచ్చింది.

అధికార దుర్వినియోగమే- ఫెడరల్ జడ్జి

ఈ కేసు విచారణ సమయంలో.. ఫెడరల్ జడ్జి ఎఫ్. డెన్నిస్ స్లేయర్ హోంల్యాండ్ సెక్యూరిటీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నిబంధన పూర్తిగా ఏకపక్షంగా ఉందని, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థులకు అమెరికాలో అవకాశాలు కల్పించడం అనేది యూఎస్ కాంగ్రెస్ పరిధిలోని అంశమని, దానిని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుతో ఎఫ్ వీసాలున్న విదేశీ విద్యార్థులు, జే వీసాలున్న పరిశోధకులు, ప్రొఫెసర్లు, ఐ వీసాలున్న విదేశీ జర్నలిస్టులకు ప్రయోజనం చేకూరనుంది.

పాత నిబంధనల ప్రకారం ఎఫ్, జే వీసాలపై అమెరికాకు వచ్చే విద్యార్థులు, పరిశోధకులు తమ కోర్సు లేదా పరిశోధన పూర్తయ్యే వరకు నిబంధనలకు లోబడి అక్కడే ఉండే అవకాశం ఉండేది. కానీ, కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల మేరకు ఈ విధానానికి స్వస్తి పలికి కాలపరిమితిని విధించారు. విద్యార్థులు & పరిశోధకులు (ఎఫ్-1, జే-1 వీసాలు): వీరి వీసా గడువును గరిష్టంగా 4 సంవత్సరాలకు పరిమితం చేశారు. ఒకవేళ కోర్సు పూర్తికాకపోయినా లేదా పొడిగింపు అవసరమైనా మళ్లీ ఇమిగ్రేషన్ విభాగానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విదేశీ జర్నలిస్టులు (ఐ వీసాలు): గతంలో విదేశీ జర్నలిస్టులకు అమెరికాలో 5 ఏళ్ల వరకు ఉండే అవకాశం ఉండగా, కొత్త రూల్స్ లో దానిని కేవలం 240 రోజులకు కుదించారు.
చైనా జర్నలిస్టులు: చైనా జర్నలిస్టుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తూ వారి నివాస గడువును కేవలం 90 రోజులకే పరిమితం చేశారు.ఫెడరల్ కోర్టు తాజా తీర్పుతో ఈ ఆంక్షలన్నీ రద్దయ్యాయి. ఫలితంగా లక్షలాది మంది విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ విద్యా, వృత్తిపరమైన కార్యకలాపాలను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.