Mahaa Daily Exclusive

  మోదీ చాలా కఠినమైన వ్యక్తి….

Share

  • మోదీ చాలా కఠినమైన వ్యక్తి
  • నాకు మంచి మిత్రుడు
  • క్వాడ్ సదస్సులో ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!

మహా : ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఆసియాన్ సదస్సు సందర్భంగా జరిగిన క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. మంగళవారం క్వాడ్ నేతల ఫోటో సెషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్, ప్రధాని మోదీని ఉద్దేశించి “ఆయన చాలా కఠినమైన (టఫ్) వ్యక్తి.. అత్యంత గౌరవనీయ నాయకుడు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనాయే తకైచీ పాల్గొన్నారు.

ఈ ముగ్గురు నేతలతో తనకు ఎంతో కాలంగా గొప్ప స్నేహ సంబంధాలు ఉన్నాయని, వీరంతా అద్భుతమైన వ్యక్తులని ట్రంప్ పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్ తర్వాత క్వాడ్ దేశాధినేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి. అలాగే ఐదు నెలల విరామం తర్వాత మోదీ, ట్రంప్ ముఖాముఖి భేటీ కావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోటో సెషన్ సమయంలో జపాన్ ప్రధాని సనాయే తకైచీని ఉద్దేశించి ట్రంప్ సరదాగా వ్యాఖ్యానిస్తూ, “మోదీ చాలా కఠినమైన వ్యక్తి, బహుశా ఈమె (తకైచీ) ఆయనకంటే ఇంకా కఠినమైన వారేమో.. మేము కూడా తక్కువేమీ కాదు” అని అన్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు పెరుగుతున్న వేళ, నవంబర్ 19న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కానున్న నేపథ్యంలో మనీలాలో జరిగిన ఈ క్వాడ్ సదస్సు డ్రాగన్‌కు గట్టి దౌత్యపరమైన సందేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

బిజీ పర్యటన ముగించుకుని భారత్‌కు ప్రధాని మోదీ

మనీలాలో రెండు రోజుల పాటు అత్యంత బిజీగా సాగిన ప్రధాని మోదీ పర్యటన ముగింపు దశకు చేరుకుందని విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) రుద్రేంద్ర టాండన్ వెల్లడించారు. ఆసియాన్-ఇండియా సదస్సు, తూర్పు ఆసియా సదస్సులతో పాటు పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ, క్వాడ్ సమావేశం అనంతరం తిరిగి భారత్‌కు బయలుదేరనున్నారు.