Mahaa Daily Exclusive

  ఆదాయంలో హైదరాబాద్‌ టాప్‌…

Share

  • ఆదాయంలో హైదరాబాద్‌ టాప్‌
  • ఖర్చులో మాత్రం రంగారెడ్డి జిల్లానే ముందు
  • జిల్లాల ఆర్థిక లెక్కల్లో ఆసక్తికర గణాంకాలు

హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల లెక్కల్లో జిల్లాల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలైన ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు నమోదైన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్‌ కీలక వాటా కలిగి ఉండగా ప్రభుత్వ ఖర్చుల విషయంలో మాత్రం ఇతర జిల్లాలు ముందున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నుంచి అధిక మొత్తంలో వ్యయం నమోదవుతుండటంతో జిల్లాలవారీగా ఆదాయ, వ్యయాల మధ్య అసమానత స్పష్టమవుతోంది.

రెవెన్యూ వ్యయం విషయంలో రంగారెడ్డి జిల్లా రూ.3,428.35 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. నల్గొండ రూ.2,690.21 కోట్లు, వరంగల్‌ అర్బన్‌ రూ.2,408.59 కోట్లు, ఖమ్మం రూ.2,277.98 కోట్లు, నిజామాబాద్‌ రూ.2,153.36 కోట్ల వ్యయంతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ములుగు జిల్లాలో రూ.563.79 కోట్లు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రూ.467.24 కోట్ల రెవెన్యూ వ్యయం మాత్రమే నమోదైంది. దీంతో జిల్లాల మధ్య ప్రభుత్వ ఖర్చుల పంపిణీలోనూ వ్యత్యాసాలు ఉన్నట్లు వెల్లడవుతోంది.

రాష్ట్ర రెవెన్యూ వసూళ్లలో హైదరాబాద్‌ జిల్లా ఏకంగా రూ.84,746.81 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా రూ.18,486.84 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర వాణిజ్య కార్యకలాపాలు, రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు, సేవారంగ సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు ఈ రెండు జిల్లాల పరిధిలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటం ఆదాయంలో ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌ ఆదాయం రంగారెడ్డి కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండటం రాజధాని ప్రాంత ఆర్థిక ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. ఇక నల్గొండ జిల్లా రూ.818.82 కోట్ల ఆదాయంతో తరువాతి స్థానంలో ఉండగా.. వికారాబాద్‌ రూ.669.60 కోట్లు, సంగారెడ్డి రూ.572.30 కోట్లు, మేడ్చల్‌ రూ.545.83 కోట్ల రెవెన్యూ వసూళ్లు సాధించాయి. ఆదాయంలో చివరి మూడు స్థానాల్లో జయశంకర్‌ భూపాలపల్లి రూ.103.12 కోట్లు, ములుగు రూ.115.28 కోట్లు, జనగామ రూ.116.06 కోట్లతో ఉన్నాయి.

ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు ప్రధానంగా హైదరాబాద్‌, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న విషయాన్ని సూచిస్తున్నాయి. అయితే ఆదాయ, వ్యయాల గణాంకాలను నేరుగా పోల్చేటప్పుడు జిల్లాల జనాభా, ప్రభుత్వ కార్యాలయాల స్థానం, పథకాల అమలు, వ్యయాల లెక్కింపు విధానం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. . అప్పుడే జిల్లాలవారీగా నిధుల కేటాయింపులు, ప్రభుత్వ ఖర్చులు, ఆదాయ వనరుల మధ్య ఉన్న వాస్తవ వ్యత్యాసాలను అంచనా వేయడానికి వీలవుతుందంటున్నారు.