Mahaa Daily Exclusive

  డబుల్ బెడ్ రూం ఇండ్ల ఆకస్మిక తనిఖీల సమాచారం లీక్…

Share

  • డబుల్ బెడ్ రూం ఇండ్ల ఆకస్మిక తనిఖీల సమాచారం లీక్
  • హౌసింగ్ డీఈఈ సస్పెన్షన్
  • ఉత్తర్వులు జారీ చేసిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం

హైదరాబాద్, మహా : డబుల్ బెడ్ రూం ఇండ్లలో అసలైన లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు హౌసింగ్ అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల సమాచారాన్ని ముందుగానే లబ్ధిదారులకు లీకు చేసిన హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) చంద్రపాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి.పి. గౌతమ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించి ఉచితంగా కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులైన లబ్ధిదారులకే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం, విక్రయించడం లేదా లబ్ధిదారులు స్వయంగా నివాసం ఉండకుండా ఇతరుల ఆధీనంలో ఉంచడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి అక్రమ కేటాయింపులను గుర్తించి, నిబంధనల ప్రకారం రద్దు చేసేందుకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినప్పటికీ, చాలామంది లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండటం లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌసింగ్ అధికారులు ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించి, నివాసం ఉండని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులకు సమాధానంగా తాము కేటాయించిన ఇళ్లలోనే నివసిస్తున్నామని పలువురు లబ్ధిదారులు పేర్కొనడంతో వాస్తవ పరిస్థితిని నిర్ధారించేందుకు ఆకస్మిక తనిఖీలను మరింత విస్తృతం చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ క్రమంలో సెలవు రోజైన ఆదివారం పెద్ద ఎత్తున ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న డీఈఈ చంద్రపాల్ ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే లబ్ధిదారులకు లీకు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, తనిఖీల సమాచారం ముందుగానే లీకు అయినట్లు నిర్ధారణ కావడంతో విధుల్లో నిర్లక్ష్యం, అధికారిక సమాచార గోప్యతను పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో డీఈఈ చంద్రపాల్‌ను సస్పెండ్ చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూముల్లో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో నిజమైన లబ్ధిదారులే నివాసం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. కేటాయించిన ఇండ్లలో లబ్ధిదారులు తప్పనిసరిగా స్వయంగా నివాసం ఉండాలని, ఇతరులకు అద్దెకు ఇచ్చినా, విక్రయించినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకం లక్ష్యం దెబ్బతినకుండా ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.