రేవంత్ కొత్త ఫార్ములా!
• హైదరాబాద్‌లో నిప్పులు.. ఢిల్లీలో నవ్వులు.
• రాజకీయ వైరం వేరు.. రాష్ట్ర ప్రయోజనాలు వేరు.
• ఇదే కమలం శ్రేణుల్లో కలకలం.
• గులాబీ గతానికి భిన్నంగా హస్తం వ్యూహం!
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకున్న రెండు జాతీయ పార్టీల అగ్రనేతలు, మరుసటి రోజే దేశ రాజధాని వేదికగా ఆత్మీయంగా నవ్వుతూ ముచ్చటించుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ‘భారత్ సమ్మిట్’ రేపిన రాజకీయ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం, ఆ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సరికొత్త విశ్లేషణలకు తెరతీసింది. ఒకవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రిగా సెంట్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూనే, మరోవైపు రాజకీయ ఎత్తుగడల్లో తనదైన ముద్ర వేస్తున్న రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ భేటీకి ముందు హైదరాబాద్‌లో జరిగిన పరిణామాలు అత్యంత నాటకీయంగా సాగాయి. భారత్ సమ్మిట్ వేదికగా విదేశీ ప్రతినిధులతో ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ అంటూ నినాదాలు చేయించారన్న అంశం కమలనాథుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం గుర్రుగా ఉన్నారని, తెలంగాణ బీజేపీ నేతలు దీనిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఈ వివాదంపై నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేసి రాజకీయ వేడిని మరింత పెంచారు. మరోవైపు, భారత్ సమ్మిట్‌కు రాకుండా దాదాపు వంద మందికి పైగా విదేశీ ప్రతినిధులను అడ్డుకున్నారని, చివరి నిమిషంలో వారి వీసాలను కేంద్రం రద్దు చేసిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ భయపడుతున్నారా అని ప్రశ్నిస్తూ, ఒకవేళ ఇది దేశద్రోహ శక్తుల కూటమి అని బీజేపీ భావిస్తే మిగిలిన విదేశీయులకు ఎందుకు వీసాలు ఇచ్చారని కేంద్రాన్ని ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేశారు.
ఇంతటి తీవ్రమైన రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొన్న మరుసటి రోజే, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోడీతో సుదీర్ఘంగా సమావేశం కావడం కరుడుగట్టిన బీజేపీ శ్రేణులకు సైతం మింగుడుపడని అంశంగా మారింది. అయితే, ఈ భేటీలో రేవంత్ రెడ్డి పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ. 30 వేల కోట్ల భారీ కరువు ప్యాకేజీని విడుదల చేయాలని ప్రధానిని కోరిన సీఎం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం మరో రూ. 10 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, అంతర్రాష్ట్ర వివాదాలకు తెరదించాలని కోరారు. ఈ చర్చల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితులపైనా ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం.
ఈ సమావేశంలో ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు కూడా రాజకీయ విశ్లేషకులను ఆకట్టుకుంది. హైదరాబాద్‌లో జరిగిన రాజకీయ విమర్శలను ఏమాత్రం మనసులో పెట్టుకోనట్లుగా, ఎంతో పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడిలా మోడీ వ్యవహరించారు. రేవంత్ రెడ్డితో నవ్వుతూ, ఉత్సాహంగా సంభాషిస్తూ, ఆయన అందించిన బహుమతులను ఆసక్తిగా తిలకిస్తూ ఫోటోలకు ఫోజులివ్వడం ద్వారా సమాఖ్య స్ఫూర్తికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవానికి తాను కట్టుబడి ఉన్నాననే బలమైన సంకేతాన్ని ప్రధాని పంపారు. పార్టీ లైన్ ప్రకారం కాంగ్రెస్‌ను రాజకీయంగా కట్టడి చేయడానికి ఏమాత్రం వెనుకాడని మోడీ, పాలనాపరమైన అంశాల్లో మాత్రం హుందాగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల విడుదల విషయంలో ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక సీఎంగా రేవంత్ రెడ్డి, ఒక పీఎంగా మోడీ తమ కర్తవ్య బాధ్యతలను నూటికి నూరు శాతం సమర్థవంతంగా నిర్వహించారనే చర్చ సాగుతోంది.
నిజానికి, రాజకీయ చమత్కారంతో ప్రత్యర్థి శిబిరంలో గందరగోళం సృష్టించడం ప్రధాని మోడీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు, నిధులపై రేవంత్ రెడ్డి ప్రస్తావించిన సందర్భంలో మోడీ తనదైన శైలిలో ‘హమ్ సే జోడో.. సబ్ మిలేగా’ (మాతో కలిసి రండి.. అన్నీ లభిస్తాయి) అంటూ బహిరంగ వేదికపైనే ఆఫర్ ఇచ్చారు. ఇతర పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి బహిరంగంగానే ఇలాంటి సంకేతాలు ఇవ్వడం వెనుక కాంగ్రెస్ శ్రేణుల్లో అపనమ్మకం కలిగించే వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తారు. మోడీతో రేవంత్‌కు లోపాయికారీ అవగాహన ఉందనే ప్రచారానికి ఆజ్యం పోయడం ద్వారా హస్తం పార్టీని బలహీనపరచాలనేది కమలం వ్యూహం కావచ్చు. అయితే, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి మధ్య ఉన్న బలమైన రాజకీయ అనుబంధం ఇలాంటి వ్యూహాలకు చిక్కేది కాదని రాజకీయ వర్గాలకు బాగా తెలుసు. అయినప్పటికీ, ప్రజల్లో ఒక ఫీలర్ వదలడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే పదప్రయోగాలు చేయడంలో మోడీ తన చతురతను మరోసారి చాటుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గత బీఆర్ఎస్ పాలనలోని కేంద్ర-రాష్ట్ర సంబంధాలను రాజకీయ పరిశీలకులు గుర్తుచేసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రధాని మోడీతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరిపిన మాజీ సీఎం కేసీఆర్, ఆ తర్వాత ఆ బంధం చెడిపోవడంతో పూర్తిగా ఘర్షణ వైఖరిని ఎంచుకున్నారు. గతంలో తనను కలిసిన కేసీఆర్, తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నానని, అందుకు సహకరించాలని కోరిన విషయాన్ని మోడీ స్వయంగా ఒక బహిరంగ సభలో బయటపెట్టి సంచలనం సృష్టించారు. ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని తేల్చిచెప్పినట్లు మోడీ ప్రకటించడం అప్పట్లో కేసీఆర్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ ఘటన తర్వాత ప్రధాని ముఖం కూడా చూడటానికి ఇష్టపడని కేసీఆర్, ఢిల్లీకి పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఫలితంగా, కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుభుక్తంగా రావాల్సిన వేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయి, రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనే విమర్శలు ఉన్నాయి.
గత పాలకుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లుగా కనిపిస్తున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన మార్గంలో పయనిస్తున్నారు. రాజకీయ విభేదాలను ఎన్నికల వేదికలకే పరిమితం చేస్తూ, పరిపాలనలో మాత్రం కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన వాటాను రాబట్టుకునేందుకు ఆయన అనుసరిస్తున్న ఈ దౌత్య నీతి తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.







