రేరా కొరడా..
* సనాలి ఐటీ పార్క్స్కు రూ.25 లక్షల జరిమానా.
* అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండానే ఫ్లాట్ల విక్రయాలకు ప్రచారం.
* 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశం.
హైదరాబాద్, మహా.
రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించే నిర్మాణ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (టీజీ రేరా) కొరడా ఝుళిపించింది. ప్రాజెక్టుకు తప్పనిసరిగా ఉండాల్సిన రేరా నమోదు ప్రక్రియ పూర్తి చేయకుండానే అపార్ట్మెంట్ల విక్రయాలకు విస్తృత ప్రచారం నిర్వహించిన ‘సనాలి ఐటీ పార్క్స్’ సంస్థకు రూ.25 లక్షల జరిమానా విధిస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించడంతో పాటు, ప్రాజెక్టుకు అధికారికంగా రేరా రిజిస్ట్రేషన్ లభించే వరకు అన్ని రకాల ప్రకటనలు, ప్రచారం, బుకింగులు మరియు విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలో ‘సనాలి ది ఎడ్జ్’ పేరుతో ప్రతిపాదించిన భారీ నివాస ప్రాజెక్టు విషయంలో ఈ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాజెక్టు తీరుపై ఎనిమిది మంది కొనుగోలుదారులు 2025లో తెలంగాణ రేరాను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదులను కలిపి విచారించిన రేరా సభ్యులు కె. శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ జన్ను 2026 నవంబర్ 17న ఉమ్మడి ఉత్తర్వులు వెలువరించారు. 2019 జూన్, జులై నెలల్లోనే బ్రోచర్లు, డిజిటల్ ప్రకటనలు, వీడియోల ద్వారా ఈ ప్రాజెక్టుపై భారీ ప్రచారం నిర్వహించారని, 35 అంతస్తులతో కూడిన మూడు టవర్లలో సుమారు 430 ఫ్లాట్లు నిర్మిస్తామని నమ్మించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1,350 నుంచి 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఫ్లాట్లను చదరపు అడుగుకు రూ.3,500 చొప్పున విక్రయిస్తామని చెప్పి కొనుగోలుదారులను ఆకర్షించినట్లు విచారణలో తేలింది.
ప్రాజెక్టుకు భవన నిర్మాణ అనుమతులు గానీ, రేరా రిజిస్ట్రేషన్ గానీ లభించకముందే ప్రచారం చేయడమే కాకుండా కొనుగోలుదారుల నుంచి నగదు వసూలు చేయడం చట్టవిరుద్ధమని అధికారులు తేల్చారు. ఫ్లాట్ల కొనుగోలు కోసం ఫిర్యాదుదారులు సంస్థకు మొత్తం రూ.70.95 లక్షలు చెల్లించారు. 2021లో భూమి కొనుగోలు, అభివృద్ధి ఒప్పందాలు, జీపీఏ పత్రాలు నమోదైనప్పటికీ, నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తాము చెల్లించిన సొమ్మును వడ్డీతో సహా ఇప్పించాలని బాధితులు రేరాను కోరారు. మరోవైపు భూ యాజమాన్య వివాదాలు, అనుమతుల జాప్యం వల్లే పనులు ఆలస్యమయ్యాయని సంస్థ తరఫున వాదించినప్పటికీ, రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు జరపడం నిబంధనలకు విరుద్ధమని రేరా స్పష్టం చేసింది.
రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టంలోని సెక్షన్ 3(1) ఉల్లంఘనకు గాను సెక్షన్ 59, 60 నిబంధనల ప్రకారం రూ.25 లక్షల జరిమానా విధిస్తున్నట్లు రేరా పేర్కొంది. అయితే భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు, అభివృద్ధి ఒప్పందాలు, యాజమాన్య హక్కుల వివాదాలు ముడిపడి ఉన్నందున, కొనుగోలుదారులు కోరిన రూ.70.95 లక్షల వాపసు మరియు వడ్డీ చెల్లింపు వంటి వ్యక్తిగత పరిహారాల కోసం సంబంధిత సివిల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించింది. ప్రస్తుత ఆదేశాలను ఉల్లంఘిస్తే సెక్షన్ 63 కింద మరింత కఠిన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థను హెచ్చరించిన రేరా, కొనుగోలుదారులు ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు రేరా రిజిస్ట్రేషన్, అనుమతులను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించింది.







