Mahaa Daily Exclusive

  డీలిమిటేషన్‌పై విపక్షాల వ్యూహరచన..! నేడు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఎంపీల కీలక భేటీ..

Share

• నేడు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఎంపీల కీలక భేటీ.

న్యూఢిల్లీ, మహా:

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించనున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలపై చర్చించేందుకు ఇండియా కూటమి ఎంపీలు సమావేశం కానున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రం తీసుకురానున్న రాజ్యాంగ సవరణ బిల్లును ఎదుర్కొనే విధానం, విపక్షాల ఉమ్మడి వైఖరిపై సమావేశంలో చర్చించనున్నారు.

ఇండియా కూటమి పార్టీల ఎంపీలతోపాటు కూటమిలో లేని డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, బిజూ జనతాదళ్ తదితర పార్టీల నేతలను కూడా ఖర్గే ఆహ్వానించినట్లు సమాచారం. కేంద్రం ప్రతిపాదనలపై విపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలన్నది ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

నవంబరు 30 నుంచి డిసెంబరు 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్‌తోపాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో విపక్షాల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు తమిళనాడుకు లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యాన్ని తగ్గించకూడదని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో విపక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కూడా ఈ సమావేశంలో కీలకంగా మారింది.

Latest