Mahaa Daily Exclusive

  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక హామీ..! అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు.

Share

  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక హామీ
  • త్వరలో ప్రత్యేక విధానం
  • అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు

షాద్ నగర్, మహా : రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీపికబురు అందించారు. ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తోందని, దాని ద్వారా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై మంత్రి ఇచ్చిన ఈ హామీతో ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల్లో ఆశలు చిగురించాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం రూ.29.70 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) షాద్‌నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రతినిధులు మంత్రిని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని షాద్‌నగర్ పట్టణం, ఫరూక్‌నగర్, కేశంపేట, నందిగామ, కొత్తూర్, కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న సొంత ఇంటి కలను ప్రజా ప్రభుత్వంలోనైనా సాకారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల స్థలాలతోపాటు జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎండీ ఖాజా పాషా (కేపీ) మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలిచే జర్నలిస్టుల జీవితాల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, నియోజకవర్గంలోని ఏడు మండలాల జర్నలిస్టులకు సమానంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు అందించిన వినతిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోందని, ఆ విధానం ద్వారా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. సొసైటీ పరంగా ఇచ్చినప్పటికీ కూడా కోర్టులో నిలవడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఇచ్చిన ఈ భరోసా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారంపై ఆశలు రేకెత్తించింది. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ షాద్‌నగర్ నియోజకవర్గ జర్నలిస్టుల సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వారికి ఇళ్ల స్థలాలు కల్పించే అంశంపై త్వరలో కార్యాచరణ రూపొందించి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల చిరకాల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, సానుకూల హామీ సాధించడంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య షాద్‌నగర్ డివిజన్ కమిటీ చొరవ ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ షాద్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు జె. రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె. నరేష్, ఉర్దూ పాత్రికేయులు మన్సూర్ అలీ ఖాన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నరసింహారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు మొయిజోద్దీన్‌తో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.

Latest