Mahaa Daily Exclusive

  క్రీడలు…. బ్యాండ్‌.. పోలీసుల ప్రతిష్ఠకు ప్రతీక..! ఆల్ ఇండియా బ్యాండ్ పోటీల్లో సిల్వర్ పథకం సాధించిన పోలీస్ సిబ్బందికి లక్ష రూపాయలు నగదు ప్రోత్సాహం ప్రకటించిన డిజిపి..

Share

  • క్రీడలు…. బ్యాండ్‌.. పోలీసుల ప్రతిష్ఠకు ప్రతీక
  • ఆల్ ఇండియా బ్యాండ్ పోటీల్లో సిల్వర్ పథకం సాధించిన పోలీస్ సిబ్బందికి లక్ష రూపాయలు నగదు ప్రోత్సాహం ప్రకటించిన డిజిపి
  • ఆల్‌ ఇండియా పోలీస్‌ క్రీడా పోటీల్లో రాణించేలా ప్రతిభావంతులను తీర్చిదిద్దాలి
  • పురుషులు, మహిళల విభాగాల్లో హైదరాబాద్‌ సిటీకి ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌
  • మహిళల విభాగంలో రన్నరప్‌గా బాసర జోన్‌, టీజీపీఏ జోన్‌–2
  • పురుషుల విభాగం రన్నరప్‌గా టీజీఎస్పీ జోన్ 2 గా నిలిచాయి.
  • ముగింపు వేడుకల్లో డీజీపీ సి.వి. ఆనంద్‌

హైదరాబాద్, మహా : పోలీసు సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికితీసి, జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని డీజీపీ సి.వి. ఆనంద్‌ సూచించారు. తెలంగాణ పోలీస్‌ శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఐదు క్లస్టర్లుగా నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ పోటీలు నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సీటీసీ జానకంపేటలో అంగరంగ వైభవంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన 27 ఏళ్ల సర్వీసులో మూడున్నరేళ్లపాటు నిజామాబాద్‌లో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన క్రీడా కార్యక్రమానికి ఇక్కడ హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. ఈసారి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టామని, ఆల్‌ ఇండియా పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌కు అనుసంధానంగా తెలంగాణ పోలీస్‌ క్రీడా బృందాలను సిద్ధం చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్నవారిని గుర్తించి, ప్రత్యేక శిక్షణతో జాతీయస్థాయి పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దాలన్నారు. అన్ని క్రీడాంశాల్లో ప్రతిభావంతులతో జట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

గతంలో ఒకేచోట క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల పాల్గొనే వారికి పరిమిత అవకాశాలు ఉండేవని, ఈసారి ఎక్కువ మంది పోలీసు సిబ్బందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు క్లస్టర్లుగా విభజించి వివిధ ప్రాంతాల్లో పోటీలు నిర్వహించామన్నారు. జులై 7న మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఇండోర్‌ క్రీడలు నిర్వహించగా సుమారు 700 మంది పాల్గొన్నారని తెలిపారు. నవంబర్‌ 2, 3 తేదీల్లో వరంగల్‌లో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ వంటి టీమ్‌ క్రీడల్లో సుమారు 500 మంది పాల్గొన్నారన్నారు. మరో క్లస్టర్‌లో రాకెట్‌ క్రీడలైన టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ తదితర పోటీలకు సుమారు 700 మంది హాజరయ్యారని వివరించారు. చివరి క్లస్టర్‌గా నిజామాబాద్‌లో నిర్వహించిన పోటీల్లోనూ సుమారు 585 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు.

పెరిగిన క్రీడాకారుల సంఖ్య

గతంలో కరీంనగర్‌లో నిర్వహించిన క్రీడల్లో సుమారు 2,200 మంది, సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన పోటీల్లో 2,530 మంది పాల్గొన్నారని డీజీపీ గుర్తుచేశారు. ఈసారి ఐదు క్లస్టర్లలో కలిపి మొత్తం 3,815 మంది క్రీడాకారులు పాల్గొనడం విశేషమన్నారు. గతంతో పోలిస్తే క్రీడాకారుల సంఖ్య గణనీయంగా పెరగడం, ఎక్కువ మందికి తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించడం ఈ విధానం విజయవంతమైనట్లు స్పష్టం చేస్తోందన్నారు.
ఇంటెలిజెన్స్‌, ఐఎస్‌డబ్ల్యూ తదితర విభాగాలను కూడా సమన్వయం చేసి ప్రతిభ ఆధారంగా సమర్థమైన జట్లను రూపొందించాలని సూచించారు. పోలీసు విధుల్లో క్రీడలు కీలక భాగమని, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

క్రీడా కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు లాభనష్టాల కోణంలో చూడకూడదని, కొన్ని కార్యక్రమాల వల్ల ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం లేకపోయినా పోలీసు శాఖలో సంప్రదాయాలను, ఉత్సాహాన్ని, ప్రతిభను పెంపొందించేందుకు అవి అవసరమని అన్నారు. బ్యాండ్‌, మౌంటెడ్‌ పోలీసు వంటి విభాగాల నిర్వహణ కూడా పోలీసు శాఖ ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి స్థాయిలోనూ సిబ్బందిని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

Latest