- పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనా డీలిమిటేషన్!
- ఆక్రమణ తొలగితే అసెంబ్లీ స్థానాల పునర్విభజన.
- ఎన్నికల సంఘానికే ప్రత్యేక బాధ్యతలు.
న్యూఢిల్లీ, మహా.
జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త డీలిమిటేషన్ బిల్లు కీలక అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూకశ్మీర్ ప్రాంతంలోనూ భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు ఇందులో ప్రత్యేక నిబంధనను చేర్చింది. ఆ ప్రాంతం పాకిస్థాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొందినప్పుడు అక్కడి అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులను నిర్ణయించే బాధ్యతను భారత ఎన్నికల సంఘానికి అప్పగించింది. ఈ మేరకు డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు-2026లోని సెక్షన్ 3(4)లో స్పష్టమైన నిబంధనను పొందుపరిచింది.
సాధారణంగా దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. అయితే పాక్ ఆక్రమణలో ఉన్న జమ్మూకశ్మీర్ ప్రాంతానికి మాత్రం ఎన్నికల సంఘమే డీలిమిటేషన్ కమిషన్‌గా వ్యవహరించేలా ప్రత్యేక ఏర్పాటును ప్రతిపాదించింది. ఈ నిబంధన అమలులోకి రావడానికి ఆ ప్రాంతం పాకిస్థాన్ ఆక్రమణ నుంచి బయటపడటం తప్పనిసరి కాగా, అప్పటివరకు ఈ ప్రతిపాదనకు ఆచరణాత్మక అమలు ఉండదు.
24 స్థానాలు ఇప్పటికీ ఖాళీగానే..
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 ప్రకారం పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతానికి సంబంధించిన 24 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే వరకు వాటిని అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్యలో పరిగణనలోకి తీసుకోకూడదని చట్టం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేసే స్థానాల సంఖ్యను 114గా నిర్ణయించారు. ఇందులో పాక్ ఆక్రమిత ప్రాంతానికి కేటాయించిన 24 స్థానాలు కూడా ఉన్నప్పటికీ, వాటికి ఎన్నికలు నిర్వహించడం లేదు. తాజాగా ప్రతిపాదించిన బిల్లు ఈ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం చూపుతోంది.
మహిళా రిజర్వేషన్లతో ముడిపడి కొత్త ప్రతిపాదనలు
ఈ డీలిమిటేషన్ బిల్లు కేవలం జమ్మూకశ్మీర్‌కే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో నియోజకవర్గాల సంఖ్య, వాటి సరిహద్దుల పునర్వ్యవస్థీకరణతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉద్దేశించిన విస్తృత శాసన ప్యాకేజీలో భాగంగా ఉంది. 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం తొలి పునర్విభజనలో ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యపై అదనంగా 50 శాతం పెంపు ప్రతిపాదించారు. దీంతో లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 850కి, రాష్ట్రాల శాసనసభల గరిష్ఠ సంఖ్య 650కి చేరేలా ప్రతిపాదనలు ఉన్నాయి. నియోజకవర్గాల సరిహద్దుల నిర్ణయానికి చట్టం అమల్లోకి వచ్చే నాటికి అందుబాటులో ఉన్న తాజా జనగణన గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోనుండగా, ప్రస్తుతం 2011 జనగణన గణాంకాలే అందుబాటులో ఉన్నాయి. మహిళలకు కేటాయించే స్థానాలను నియోజకవర్గాల వారీగా మారుస్తూ రొటేషన్ పద్ధతిలో కేటాయించే అధికారం డీలిమిటేషన్ కమిషన్‌కు కల్పించారు.
ఏప్రిల్ బిల్లుల స్థానంలో కొత్త ప్రతిపాదనలు
ఈ ఏడాది ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ఏప్రిల్ 17న జరిగిన ఓటింగ్‌లో రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో మిగిలిన రెండు బిల్లులపై తదుపరి చర్యలు నిలిచిపోయాయి. వివిధ రాష్ట్రాల జనాభా పెరుగుదలలో తేడాల నేపథ్యంలో పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయని కేంద్రం తన ఉపసంహరణ ప్రతిపాదనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 132వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణకు కొత్త బిల్లును తీసుకురావాలని నిర్ణయించింది.







