Mahaa Daily Exclusive

  గురుకులాలు, మదర్సాల్లో చదివితే మనసు విషపూరితం..! జావేద్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..

Share

  • గురుకులాలు, మదర్సాల్లో చదివితే మనసు విషపూరితం!
  • జావేద్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..
  • విద్యావ్యవస్థపై ఘాటు విమర్శలు.
  • పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదు..
  • ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే రిక్షా కార్మికుల పిల్లలు ఎక్కడ చదువుకోవాలి?
  • 80–85 కోట్ల మందికి ఆహారం ఇస్తున్న ప్రభుత్వం.
  • విద్య ఎందుకు అందించలేకపోతోంది?

పుణె, మహా:

గురుకులాలు, మదర్సాల్లో విద్యాబోధనపై ప్రముఖ కవి, గేయ రచయిత, జాతీయ పురస్కార గ్రహీత జావేద్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయా విద్యాసంస్థల్లో చదువుకుని బయటకు వచ్చే పిల్లల మనసులు విషంతో నిండిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని పుణెలో అఖిల భారతీయ మహాత్మా ఫూలే సమతా పరిషత్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్‌ భుజ్‌బల్‌ చేతుల మీదుగా 2026 మహాత్మా ఫూలే సమతా పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం దేశ విద్యావ్యవస్థ, పేదలకు విద్యావకాశాలు, కుల వ్యవస్థపై మాట్లాడారు.
భారతదేశం ప్రతిభావంతులు, తెలివైన వ్యక్తులు ఉన్న దేశమని, అయితే పేద కుటుంబాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు క్రమంగా దూరమవుతున్నాయని జావేద్‌ అక్తర్‌ అన్నారు. విద్య ఖరీదైన వ్యవహారంగా మారిందని, దానిని భరించగలిగే స్థోమత ఉన్న వర్గాలకే నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటోందని పేర్కొన్నారు. సాధారణ కుటుంబానికి చెందిన పిల్లలకు కూడా సరైన విద్య అందితే వారు ఉన్నత స్థాయికి ఎదగగలరని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే రిక్షా లాగే కార్మికుడి పిల్లలు ఎక్కడ చదువుకుంటారని ప్రశ్నించారు. ఒకవేళ ఆ చిన్నారులు నాణ్యత లేని పాఠశాలలకు వెళితే అక్కడ మంచి ఉపాధ్యాయులు, సరైన విద్యా వ్యవస్థ, నాణ్యమైన పాఠ్యప్రణాళికలు ఉండవని అన్నారు. ఇదే సందర్భంలో మదర్సా లేదా గురుకులం నుంచి బయటకు వచ్చే పిల్లల మనసులు విషంతో నిండిపోతాయని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం ప్రకారం విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని జావేద్‌ అక్తర్‌ స్పష్టం చేశారు. దేశంలో 80 నుంచి 85 కోట్ల మందికి ఆహారం అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, అదే స్థాయిలో ప్రజలకు విద్యను ఎందుకు అందించలేకపోతోందని ప్రశ్నించారు. ఆహారం కంటే చదువు తక్కువ ప్రాధాన్యమైందా? కడుపు నిండినా తల ఖాళీగానే ఉంటుందని, ప్రజలు అజ్ఞానంలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారని నిలదీశారు. ఒక వ్యక్తికి విద్య అందిస్తే రెండు పూటల భోజనం కోసం మరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.

కుల వ్యవస్థ వల్లే విద్యకు దూరం.

భారతదేశం పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో వెనుకబడటానికి కుల వ్యవస్థ కూడా కారణమని జావేద్‌ అక్తర్‌ ఆరోపించారు. శారీరక శ్రమ చేసే వర్గాలకు గతంలో విద్యను నిరాకరించడం వల్ల వారి సృజనాత్మకత, ఆవిష్కరణలకు అవకాశాలు దక్కలేదన్నారు. కమ్మరి, కుమ్మరి, రైతులు వంటి వృత్తి ఆధారిత వర్గాలకు విద్య అందుబాటులో ఉండి ఉంటే అనేక సాంకేతిక ఆవిష్కరణలు దేశంలోనే జరిగేవని పేర్కొన్నారు. పారిశ్రామిక విప్లవం తర్వాత సాంకేతిక అభివృద్ధిలో భారత్‌ వెనుకబడటానికి ఈ పరిస్థితులు కూడా దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం వల్ల పేద పిల్లలకు విద్య అందించే అవకాశాలు మరింత తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విద్యా రంగంలో చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. అణగారిన వర్గాలకు విద్య అందించేందుకు వారు ఎదుర్కొన్న అవమానాలు, అడ్డంకులు అసాధారణమైనవని కొనియాడారు. ఫూలే దంపతుల ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.
పరీక్షల్లో అక్రమాలపై ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్న పరిస్థితులపైనా ఆయన స్పందించారు. దేశం పట్ల నిజమైన శ్రద్ధ ఉన్నవారు తమ హక్కుల కోసం ప్రశ్నించడానికి భయపడకూడదని యువతకు సూచించారు. అలా ప్రశ్నించినందుకు దేశద్రోహి అని పిలిస్తే దాన్ని మరో పద్మభూషణ్‌ పురస్కారంగా భావించాలని వ్యాఖ్యానించారు. మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే ప్రారంభించిన విద్యా ఉద్యమం ఇంకా పూర్తికాలేదని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు.

Latest