- మరో నలుగురికి తీవ్ర గాయాలు.. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షల పరిహారం ప్రకటన.
డెహ్రాడూన్, మహా.
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌరీ గర్వాల్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రిఖ్నిఖాల్ ప్రాంతంలోని కల్వాడి వద్ద శనివారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 12 మంది ఉన్నారు. వారంతా భంగల్వాడ్ గ్రామానికి చెందినవారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘దీదీ–భూలీ’ పథకం కింద దరఖాస్తులు సమర్పించేందుకు వీరంతా రిఖ్నిఖాల్కు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పనులు ముగించుకుని ఈకో వాహనంలో తిరిగి భంగల్వాడ్ గ్రామానికి బయలుదేరారు. కల్వాడి సమీపంలో వాహనం అదుపుతప్పి సుమారు 200 నుంచి 300 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. క్షతగాత్రులను లోయ నుంచి బయటకు తీసి సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తొలుత ఏడుగురు మృతిచెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజా వివరాల ప్రకారం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో ఏడుగురు మహిళలు, వాహన డ్రైవర్ ఉన్నారు.
మోదీ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు.
సీఎం ధామి విచారం.. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని అవసరమైతే విమానంలో ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.







