Mahaa Daily Exclusive

  కరెంట్‌ బిల్లు కట్టను.. దమ్ముంటే కట్‌ చేసి చూపించు..! ఎమ్మెల్యే నాయిని పేరు చెప్పి విద్యుత్‌ సిబ్బందికి బెదిరింపులు..

Share

  • కరెంట్‌ బిల్లు కట్టను.. దమ్ముంటే కట్‌ చేసి చూపించు!
  • ఎమ్మెల్యే నాయిని పేరు చెప్పి విద్యుత్‌ సిబ్బందికి బెదిరింపులు.
  • రూ.3.58 లక్షల బకాయిలు!

హనుమకొండ, మహా.

కరెంట్‌ బిల్లు చెల్లించాలని అడిగిన విద్యుత్‌ సిబ్బందిపైనే ఓ కాంగ్రెస్‌ నాయకుడు చిందులు తొక్కిన ఘటన హనుమకొండలో కలకలం రేపింది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి పేరు చెప్పి అధికారులను బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బిల్లు కట్టనని, దమ్ముంటే తన ఇంటి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి చూపించాలని సవాల్‌ చేసినట్లు ప్రచారంలో ఉన్న వీడియోలో కనిపిస్తోంది. విధి నిర్వహణలో ఉన్న విద్యుత్‌ సిబ్బందిని దూషించడమే కాకుండా, దాడికి పాల్పడినట్లు బాధిత ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హనుమకొండలోని సుబేదారి పరిధి అలిపురలో నివాసం ఉంటున్న కాంగ్రెస్‌ నాయకుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అనుచరుడిగా చెప్పబడుతున్న ఇస్మాయిల్‌ ఇంటికి విద్యుత్‌ శాఖ సిబ్బంది బకాయిల వసూలు కోసం వెళ్లారు. దీర్ఘకాలంగా విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వాటిని చెల్లించాలని కోరారు. ఈ క్రమంలో ఇస్మాయిల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేసేందుకు లైన్‌మెన్‌ స్తంభం ఎక్కే ప్రయత్నం చేయడంతో ఆయన మరింత రెచ్చిపోయినట్లు సమాచారం. రూ.8 వేలు, రూ.12 వేల బిల్లులకే ఇంత హడావుడి చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తూ, ఎమ్మెల్యే చెప్పినా వినరా, తన పవర్‌ ఏమిటో చూపిస్తానంటూ హెచ్చరించినట్లు వీడియోలోని వ్యాఖ్యలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా విద్యుత్‌ అధికారులపై దుర్భాషలాడుతూ, మిమ్మల్ని కొట్టకుండా మాట్లాడుతున్నందుకు సంతోషించాలని కూడా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
మూడు సర్వీసులకు రూ.3.58 లక్షల బకాయిలు
విద్యుత్‌ శాఖ అధికారుల వివరాల ప్రకారం ఇస్మాయిల్‌ నివాసానికి సంబంధించి రూ.28 వేలు, వేయి స్తంభాల గుడి సమీపంలోని యూనికాన్‌ కూలర్స్‌ దుకాణానికి రూ.80 వేలు, మడికొండలోని యూనికాన్‌ ఇండస్ట్రీకి రూ.2.50 లక్షల విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మూడు సర్వీసులకు కలిపి మొత్తం రూ.3.58 లక్షల బకాయిలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధిత విద్యుత్‌ సిబ్బంది పోలీసులను ఆశ్రయించి ఇస్మాయిల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, రాజకీయ పలుకుబడి పేరుతో విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Latest