హైదరాబాద్, మహా : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన బోరకాని సునీత (25) గర్భిణీ మరణ ఘటనపై నిర్వహించిన విచారణలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, వైద్య సేవల్లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో డాక్టర్ సాహిత్య గుమ్ముల కాంట్రాక్ట్ సేవలను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
సునీత 32 వారాల జంట గర్భంతో, రక్తహీనత, గతంలో సిజేరియన్ ప్రసవం వంటి వైద్య సమస్యలతో అక్టోబర్ 21న రిమ్స్ జనరల్ ఆసుపత్రి, అదిలాబాద్‌లో చేరారు. కాళ్ల వాపుతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు, పర్యవేక్షణ నిర్వహిస్తూ చికిత్స అందించారు. అక్టోబర్ 24 తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరిస్థితి విషమించి, అత్యవసర వైద్య చికిత్స అందించినప్పటికీ ఉదయం 6.30 గంటలకు మృతి చెందారు.
ఈ ఘటనపై కమిషనర్, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు నలుగురు సభ్యుల విచారణ కమిటీ రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, వైద్య రికార్డులు, కేస్ షీట్లు, చికిత్స వివరాలు, సంబంధిత వైద్య సిబ్బంది వాంగ్మూలాలను పరిశీలించింది.
విచారణలో రక్తపోటు సాధారణ స్థాయిలో నమోదవుతున్నప్పటికీ లాబెటలోల్ మందు మోతాదును పెంచడం, సీనియర్ వైద్యుల పర్యవేక్షణ, రోగి పరిస్థితిని పునఃపరిశీలించడం, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తిన అనంతరం సకాలంలో వైద్య జోక్యం, చికిత్సను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో లోపాలపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. రోగి పరిస్థితి విషమించిన సమయంలో సకాలంలో పునఃపరిశీలన, తగిన వైద్య చర్యలు తీసుకోవడంలో జరిగిన జాప్యాన్ని విచారణ నివేదిక ప్రస్తావించింది.
ఘటన జరిగిన సమయంలో డ్యూటీ వైద్యురాలిగా ఉన్న డాక్టర్ సాహిత్య గుమ్ముల సకాలంలో స్పందించకపోవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, వృత్తిపరమైన బాధ్యతల నిర్వర్తనలో లోపాలను తీవ్రంగా పరిగణిస్తూ విచారణ నివేదిక ఆధారంగా ఆమె కాంట్రాక్ట్ సేవలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గర్భిణీలు, ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులకు నిరంతర వైద్య పర్యవేక్షణ, సకాలంలో పరీక్షలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించడం అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేశారు. వైద్య సేవల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.








