Mahaa Daily Exclusive

  చదువుతో పాటు సృజనాత్మకతకూ పెద్దపీట..! సర్టిఫికెట్లు, జ్ఞాపికలతో అభినందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

Share

  • చదువుతో పాటు సృజనాత్మకతకూ పెద్దపీట
  • గిరిజన విద్యార్థులకు వెండితెర పాఠాలు.. కెరీర్‌కు కొత్త బాటలు
  • దర్శకత్వం నుంచి నటన వరకు.
  • 40 మంది విద్యార్థులకు చలనచిత్ర రంగంలో ప్రత్యేక తర్ఫీదు
  • సర్టిఫికెట్లు, జ్ఞాపికలతో అభినందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్, మహా : విద్యార్థుల్లోని సృజనాత్మకతకు సరైన వేదిక కల్పిస్తే సంప్రదాయ చదువులకు అతీతంగా ఎన్నో రంగాల్లో రాణించగలరని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యే మనిషి జీవిత గమనాన్ని నిర్దేశిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా విద్యార్థుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. పాఠ్యాంశాలతో పాటు కళలు, క్రీడలు, ఇతర నైపుణ్యాల్లోనూ ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించడం అవసరమన్నారు. ఈ దిశగా గిరిజన గురుకుల విద్యార్థులకు చలనచిత్ర రంగంలో శిక్షణ అందించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడు రోజుల ప్రత్యేక శిక్షణను 40 మంది విద్యార్థులు విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా శనివారం సేవాలాల్ బంజారా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వారికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుందని, దానిని గుర్తించి తగిన దిశానిర్దేశం చేస్తే అద్భుత ఫలితాలు సాధించగలరని అన్నారు. గిరిజన, వెనుకబడిన వర్గాల యువతకు సంప్రదాయ విద్యతో పాటు ఆధునిక సాంకేతిక, కళాత్మక రంగాల్లోనూ ప్రవేశించే అవకాశాలు కల్పించాలన్నారు. తమ అభిరుచులను గుర్తించి, వాటికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

వెండితెర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ

బంజారాహిల్స్‌లోని దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్‌లో సంస్థ డైరెక్టర్ శఉమా మహేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 40 మందికి దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్, నటన, కథా రచన వంటి విభాగాల్లో నిపుణులు మెళకువలు నేర్పించారు.

సినిమా నిర్మాణ ప్రక్రియలోని సృజనాత్మక, సాంకేతిక అంశాలను పరిచయం చేయడంతో పాటు ప్రాయోగిక అభ్యాసానికి అవకాశం కల్పించారు. దీనివల్ల విద్యార్థులకు చిత్ర పరిశ్రమ పనితీరుపై అవగాహన ఏర్పడటమే కాకుండా, తమ ఆసక్తిని వృత్తిగా మలుచుకునే దిశగా ప్రాథమిక అనుభవం లభించింది.

గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో సంప్రదాయ బోధనకు మించి అనుభవాధారిత విద్య, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యమిచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. విద్యార్థుల అభిరుచులను గుర్తించి, వారికి విస్తృతమైన అవకాశాలను పరిచయం చేసే క్రమంలో ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రోత్సాహం అందించారు.

దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్‌తో కుదిరిన ఈ సహకారం గురుకుల విద్యార్థులకు చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ప్రతిభకు తగిన వేదిక లభిస్తే గిరిజన యువత కూడా సృజనాత్మక రంగాల్లో విజయాలు సాధించగలరనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.

ఇలాంటి భాగస్వామ్యాలను భవిష్యత్తులో మరిన్ని రంగాలకు విస్తరించి, విద్యార్థులకు విభిన్న కెరీర్ మార్గాలను పరిచయం చేయాలని సంస్థ భావిస్తోంది. గురుకులాలను విద్యాబోధనకే పరిమితం చేయకుండా కళలు, సృజనాత్మకత, ఆవిష్కరణలు, వృత్తి నైపుణ్యాలకు కేంద్రాలుగా అభివృద్ధి చేయడంలో ఈ కార్యక్రమం ఒక ముందడుగుగా నిలిచింది.

Latest