Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌ కీలక విభాగాల్లో భారీ బదిలీలు..! ఎనిమిది మంది ఐఏఎస్‌, నాన్‌ క్యాడర్‌ అధికారులకు కొత్త బాధ్యతలు..

Share

హైదరాబాద్‌, మహా:

తెలంగాణలో పరిపాలనా యంత్రాంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఎనిమిది మంది ఐఏఎస్‌, నాన్‌ క్యాడర్‌ అధికారులను బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్లు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, విద్యాశాఖల్లో మార్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు నవంబరు 28న జీవో ఆర్టీ నంబరు 1740 జారీ చేశారు.

హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, ప్రభుత్వ మెట్రోపాలిటన్‌ ఏరియా అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ కార్యదర్శిగా నియమించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఈ బాధ్యతలతోపాటు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా నియమించారు.

మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి ఈవీ నరసింహారెడ్డిని హెచ్‌ఎండీఏ నూతన మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా నియమించారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ఎండీగా ఇన్వెస్ట్‌ తెలంగాణ సీఈవో బి. అజిత్‌రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఈఎస్‌ఎస్‌డీ మనోజ్‌ను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు.

జీహెచ్‌ఎంసీ శంషాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా ఉన్న కె. చంద్రకళను హెచ్‌ఎండీఏ జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌, ల్యాండ్‌ పూలింగ్‌, మెట్రో రైల్‌ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ప్రత్యేక కలెక్టర్‌ (భూసేకరణ)గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు. ఆమె స్థానంలో హైదరాబాద్‌ జలమండలి జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌కు జీహెచ్‌ఎంసీ శంషాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

విద్యాశాఖలోనూ మార్పులు చేపట్టారు. వరంగల్‌ స్టేట్‌ ఆడిట్‌ ప్రాంతీయ ఉప సంచాలకుడిగా పనిచేస్తున్న పి. రామును విద్యాశాఖ ప్రత్యేక అధికారి (ప్రాజెక్టులు)గా నియమించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న వి. శ్రీనివాస్‌రెడ్డిని రిలీవ్‌ చేసి తన మాతృశాఖకు నివేదించాల్సిందిగా ఆదేశించారు.

హెచ్‌ఎండీఏ, మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌, మూసీ ప్రాజెక్టు, విద్యాశాఖల్లో ఒకేసారి చేపట్టిన ఈ మార్పులతో ఆయా విభాగాల ఉన్నతాధికారుల బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.

Latest