- టోల్‌గేట్ వద్ద ఐడీ అడిగితే ఉద్యోగాల నుంచి తొలగింపా..!
- ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ఆగ్రహానికి ఐదుగురు చిరుద్యోగులు బలి.
- రూ.100 టోల్ ఫీజు వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం.
అమరావతి, మహా
విధి నిర్వహణలో నిబంధనలు పాటించడమే ఐదుగురు చిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. టోల్ ఫీజు మినహాయింపు కోరిన వాహనంలో ఉన్నది ఎవరనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు గుర్తింపు కార్డు అడిగినందుకు ఐదుగురు ఉద్యోగాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ పశ్చిమ బైపాస్‌లోని వెంకటపాలెం టోల్‌ప్లాజా వద్ద నవంబరు 26న ఈ ఘటన చోటుచేసుకుంది. కార్తికేయ మిశ్రా ప్రయాణిస్తున్న వాహనం టోల్‌గేట్ వద్దకు చేరుకోగా, ఆయన డ్రైవర్ టోల్ ఫీజు చెల్లించకుండానే గేటు తెరవాలని సిబ్బందిని కోరారు. అయితే వాహనం ముందు భాగంలో అధికారిక ఫ్లాగ్ లేకపోవడంతో పాటు, అందులో ఉన్న అధికారి వివరాలను డ్రైవర్ స్పష్టంగా తెలియజేయకపోవడంతో సిబ్బంది గుర్తింపు కార్డు చూపించాలని కోరారు. ఈ క్రమంలో కారులో ఉన్న మిశ్రా తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం.
తాను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శినని చెప్పినప్పటికీ గుర్తింపు కార్డు అడగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టోల్ సిబ్బంది వెల్లడించారు. పరిస్థితిని గమనించిన టోల్ ఇన్‌ఛార్జి అక్కడికి చేరుకుని పొరపాటు జరిగిందని క్షమాపణలు కోరినప్పటికీ అధికారి శాంతించలేదని బాధితులు తెలిపారు. తనను ఆపినందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుమారు 10 నుంచి 14 నిమిషాలపాటు అక్కడే ఉండిపోయినట్లు తెలుస్తోంది.
ఐదుగురి ఉద్యోగాలకు ఎసరు
టోల్‌గేట్ వద్ద జరిగిన ఘటనతో ఈ వివాదం ముగియలేదు. అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, టోల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను సీఎంవో కార్యాలయానికి పిలిపించినట్లు సమాచారం. ఘటన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారి ఆదేశించినట్లు తెలుస్తోంది. వాహనంపై అధికారిక ఫ్లాగ్ లేకపోవడం, సిబ్బంది కావాలని అడ్డుకోకపోవడం వంటి అంశాలను నిర్వాహకులు వివరించినప్పటికీ ఫలితం లేకపోయింది.
దీంతో ముగ్గురు టోల్ కలెక్టర్లు, ఒక సూపర్‌వైజర్, ఒక షిఫ్ట్ ఇన్‌ఛార్జితో కలిపి ఐదుగురిని కాంట్రాక్టు సంస్థ విధుల నుంచి తొలగించింది. ఈ టోల్‌గేట్ నిర్వహణ బాధ్యతలను గురుగ్రామ్‌కు చెందిన స్కైలార్క్ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ సంస్థ చేపడుతోంది. ఉన్నతాధికారి ఒత్తిడితో తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అమరావతి ప్రాజెక్టు డైరెక్టర్ నిరాకరించారు. అటు కార్తికేయ మిశ్రా నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.
టోల్ మినహాయింపుపై నిబంధనలు ఏం చెబుతున్నాయి?
జాతీయ రహదారుల టోల్ రుసుము మినహాయింపులకు సంబంధించి 2008 నాటి జాతీయ రహదారుల రుసుము నిర్ణయం, వసూలు నిబంధనల్లోని 11వ నిబంధన కీలకమైనది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా నిర్దేశిత ప్రముఖులకు, కొన్ని అధికారిక విధుల్లో వినియోగించే వాహనాలకు మినహాయింపులు ఉన్నాయి. అయితే కేవలం ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్నంత మాత్రాన ప్రతి వాహనానికి ఆటోమేటిక్‌గా టోల్ మినహాయింపు లభించదు. వాహనం వినియోగం, అధికారిక విధి, వర్తించే నిబంధనలను బట్టి మినహాయింపు నిర్ణయించాల్సి ఉంటుంది.








