- రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు.
- హరీశ్ రావును కలిసిన జగ్గారెడ్డి!
- వ్యక్తిగత ఆహ్వానం అందించిన కాంగ్రెస్ సీనియర్ నేత.
- సరదా వ్యాఖ్యలతో ఆకట్టుకున్న ఇరువురు నేతలు.
హైదరాబాద్, మహా:
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తూర్పు జగ్గారెడ్డి స్వయంగా కలిసి వ్యక్తిగత ఆహ్వానం అందించారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ఎలాంటి భేషజాలు లేకుండా ఆప్యాయంగా, సరదా వాతావరణంలో ముచ్చటించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, గతంలో హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తాను సన్మానం చేశానని, కానీ ఇలా వ్యక్తిగత ఆహ్వానం ఇవ్వడం ఇదే తొలిసారని తెలిపారు. గతంలో తన కుటుంబంలో జరిగిన ఒక కార్యక్రమాన్ని హరీశ్ రావు మిస్ అయ్యారని, ఈసారి మాత్రం అలా జరగకూడదనే ఉద్దేశంతోనే స్వయంగా పిలవడానికి వచ్చానని చెప్పడంతో అక్కడున్న వారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలు రాజకీయాలేనని, ఈ కలయిక వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, కేవలం మనస్ఫూర్తిగా పిలవాలనిపించే వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
సరదా వ్యాఖ్యలతో నవ్వుల పువ్వులు
హరీశ్ రావు బీఆర్‌ఎస్‌లో అగ్రనేత అని ప్రశంసిస్తూనే, “వారు టాప్ లీడర్.. నేను టాపో, తుప్పో గానీ..” అంటూ జగ్గారెడ్డి తనదైన చమత్కారంతో చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. జగ్గారెడ్డి మాట్లాడుతున్న సమయంలో “మీరేం చెబితే అదే హెడ్డింగ్” అంటూ పక్కనున్న వారు సరదాగా అనడంతో హరీశ్ రావు సహా అక్కడున్న నేతలంతా చిరునవ్వులు చిందించారు.
హరీశ్ రావు పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ రాజకీయంగా వేర్వేరు పక్షాల్లో ఉన్నా ఎప్పుడూ వ్యక్తిగతంగా విభేదించలేదని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. 21 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నప్పటికీ, ఇరువురు నేతలు వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడం ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.








