ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, సీఎం అతిషి ఈ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. గత ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ఢిల్లీ ప్రజలు మద్దతుగా నిలిచారన్నారు. వారి ఆశీస్సులు, మద్దతు లేకుండా ఇవేవీ సాధ్యం కాదన్నారు. ఈసారి కూడా తనపై వారి ఆశీస్సులు ఉంటాయని ఆకాంక్షించారు. ఎన్నికల్లో పోటీకి అవసరమైన డబ్బును ప్రజల నుంచి విరాళంగా పొందేందుకు ఆన్‌లైన్ లింక్‌ను కూడా ఆమె విడుదల చేశారు. ఆప్ ఎల్లప్పుడూ సామాన్యుల నుంచి వచ్చే చిన్న విరాళాల సహాయంతో ఎన్నికల్లో పోరాడిందని పేర్కొన్నారు. పార్టీ పని తీరు, నిజాయితీ రాజకీయాలను కొనసాగించడంలో ఇది సహాయపడుతుందని అతిషి అన్నారు.








