సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనలో ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నట్లుగానే రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మైనారీటీలు సంతృప్తిగా లేరని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా సారంగపూర్ సమీపంలో జరుగుతున్న తబ్లిగి జమాతే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, ఎన్నికల హామీల్లో భాగంగా చేవెళ్లలో ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ లో రూ. 3 వేల కోట్లకు గాను కేవలం రూ. 700 కోట్లే ఖర్చు చేశారని పేర్కొన్నారు. దీనిని బట్టి రేవంత్ రెడ్డికి మైనారిటీలపై ఎంతశ్రద్ధ ఉందో తెలుస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో మత ఘర్షణలు లేవని, రేవంత్ రెడ్డి పాలనలో లెక్కలేనన్ని ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. తక్షణమే మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.








