Mahaa Daily Exclusive

  మహిళపై గుంటనక్క దాడి వాకిలి ఊడుస్తుండగా ఘటన తీవ్ర గాయాల పాలైన మహిళ…!

Share

ఈ మధ్య అడవిలో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వస్తూ కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు కుక్కలతో పాటు అడవి నుంచి వచ్చిన చిరుత, పులి, ఎలుగుబంటి లాంటి మృగాలు జనాలపైన దాడులు చేయటం చూశాం. తాజాగా ఒక గుంటనక్క కూడా జనావాసాల్లోకి రావటమే కాదు మనుషులపై దాడి చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటలో జరిగింది. గ్రామానికి చెందిన సూత్రం రాధ (34) అనే వివాహిత ఉదయం ఐదున్నర సమయంలో వాకిలి ఊడుస్తుండగా ఓ నక్క ఆమెపై దాడికి తెగబడింది. మొదట కుక్క అనుకుని వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. వెళ్లిపోయినట్టుగానే వెళ్లిపోయిన ఆ గుంటనక్క ఊడుస్తున్న సమయంలో ముందు నుంచి వచ్చి ముఖం, మెడపై దాడి చేసింది. ఈ దాడిలో రాధ ముఖం ఛిద్రం కాగా మెడకు కూడా గాట్లు పడ్డాయి.

రాధ అరుపులు విన్న ఇరుగుపొరుగు వాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి నక్కను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా వారిపైన కూడా దాడికి యత్నించింది. కట్టెతో బెదిరించటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. మళ్లీ ఆరున్నర సమయంలో సైలెంట్‌గా వచ్చిన నక్క రోడ్డుపై వెళ్తున్న మరో వ్యక్తి కాలిని కరిచింది. మొదట కుక్క అనుకుని వెళ్లగొట్టగా తర్వాత నక్క అని గుర్తించారు. అక్కడ కొడితే ఇక్కడికొచ్చినట్టు ముందు కట్టెతో కొట్టిన వ్యక్తిపైన మళ్లీ దాడి చేసింది ఆ గుంట నక్క. దీంతో ఈసారి కట్టెతో బలంగా కొట్టటంతో దెబ్బకు ఆ నక్క చచ్చి ఊరుకుంది.

నక్క దాడిలో గాయపడిన రాధను హుటాహుటిన ముస్తాబాద్ ఆస్పత్రికి తరలించగా వైద్యం అందిస్తున్నారు. ముఖంపై తీవ్రంగా గాయాలు కావటంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. మిగతా ఇద్దరి మీద కూడా దాడి చేయగా వారికి కూడా కాళ్లకు బలంగానే గాట్లు పడ్డాయి. అయితే రాధకు ఇటీవలే కిందపడిపోగా నడుము తీవ్రంగా గాయమైందని దాని నుంచి కాస్త కోలుకుంటుందనుకునేలోపే ఈ గుంటనక్క దాడి చేసిందని స్థానికులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Latest