ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి పాలైంది. దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. ఆప్ ఓడిపోతున్న క్రమంలో సెక్రటేరియట్ లోని కీలక ఫైళ్లు తరలిపోకుండా ఉండేందుకు ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో సెక్రటేరియట్ ను జీఏడీ సీజ్ చేసింది. గత పదేళ్లుగా ఆప్ పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని గతంలో ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పుడు యాక్షన్ తీసుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది. గతంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో అధికార పార్టీ ఓటమి పాలవగానే సచివాలయంలో నుంచి ఫైళ్ళు మాయం కావడం, అనూహ్యంగా అగ్ని ప్రమాదాలు సంబవించడం, ఆ ప్రమాదంలో కీలక ఫైళ్ళన్నీ మాయం కావడం తదితర పరిణామాలు చోటుకున్న నేపథ్యంలో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్, జంగ్ పురా నుంచి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఓటమి పాలయ్యారు. మొత్తం 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ విజయ సాధించి ప్ఱబుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని దక్కించుకుంది.








