Mahaa Daily Exclusive

  అధికారంలోకి వస్తే ముస్లిం బీసీ పదం తొలగిస్తాం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Share

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల వివక్ష, నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై శనివారం కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అభ్యర్థులు, కీలక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతున్నదని, అద్భుతమైన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు తెలంగాణ బీజేపీ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తర భారత దేశంతో పాచు దక్షిణ భారతదేశంలోనూ బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం బీసీ పదాన్ని తొలగిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ మూడింటిని స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తుందన్నారు. రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలన వైఫల్యాలే ప్రచారంలో ప్రధాన ఎజండా అని స్పష్టం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, చదువుకున్నయువతులు ఇలా అన్ని వర్గాలకు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అనేక హామీలను ఇచ్చిందని, అధికారంలోకి రాగానే ఆ హామీలన్నింటినీ విస్మరించి కొత్త వివాదాలను తెరపైకి తేస్తూ కాలయాపన చేస్తూ ప్రజల దృష్టిని హామీల నుంచి మళ్ళించేందుకు ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అమలు చేయని హామీలపైనే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విద్యావంతులు, వేధావులు, ఉపాధ్యాయుల ముందుకు వెళ్ళాలని నిర్ణయించామన్నారు. మేమేం కొత్త అంశాలను తెరపైకి తేవడం లేదని, బీఆర్ఎస్ బాటలోనే వెళ్తున్న కాంగ్రెస్ పార్టీని కళ్ళు తెరిపించాలని ఓటర్లను కోరుతామన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పరోక్షంగా సహకరిస్తుందని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.