నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం ఉదగయం ఢిల్లీకి చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన అర్ధాంగి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి ఆయన తన పర్యటనను యమునా నదీ తీరంలోని విశాలమైన స్వామినారాయణ అక్షరధామ్ ఆలయ సందర్శనతో ఆరంభించారు. వాన్స్ కుటుంబం ఆలయ ప్రాంగణంలో దాదాపు గంట సమయం గడిపింది. వారికి ఆలయ నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న వాన్స్ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆలయ సందర్శన అనంతరం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సందర్శకుల పుస్తకంలో తన అనుభూతిని పంచుకున్నారు. “ఈ అద్భుత ప్రదేశానికి నన్ను, నా కుటుంబాన్ని ఆహ్వానించి, ఆదరించిన మీ దయ, ఆతిథ్యానికి ధన్యవాదాలు. ఇంతటి సుందరమైన ఆలయాన్ని ఎంతో నిబద్ధతతో, శ్రద్ధతో నిర్మించడం భారతదేశానికి గర్వకారణం. ముఖ్యంగా మా పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడ్డారు. దేవుడి ఆశీస్సులు మీకుండాలి” అని ఆయన పేర్కొన్నారు. ఆలయంలో ఏనుగుల శిల్పాలతో అలంకరించబడిన గజేంద్ర పీఠం వాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుందని, ఆలయ ప్రాంగణంలో తనకు ఎంతో ప్రశాంతత లభించిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ఆలయ వాలంటీర్ ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా వాన్స్ కుటుంబానికి చెక్కతో చేసిన ఏనుగు ప్రతిమ, ఢిల్లీ అక్షరధామ్ ఆలయ నమూనా, పిల్లల పుస్తకాలను బహూకరించినట్లు ఆలయ పూజారి ఒకరు వెల్లడించారు. వాన్స్ కుటుంబం ఆలయంలోని అద్భుతమైన కళ, వాస్తుశిల్పాన్ని పరిశీలించిందని, భారతదేశ వారసత్వం, సాంస్కృతిక లోతును అనుభూతి చెందారని, అలాగే సామరస్యం, కుటుంబ విలువలు, శాశ్వత జ్ఞానం వంటి సందేశాలను అభినందించారని ఆలయ నిర్వాహకులు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు.








