భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (మహా):
మే 20వ తేదీన సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు , అన్ని విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు పాల్గొననున్నారని, ఈ సమ్మె సందర్భంగా కార్మిక వర్గం చేస్తున్న డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ సంస్థల యజమానులు సహకరించాలని కోరుతూ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె నోటీసులను కాంట్రాక్టర్ లకు, సూపర్ వైజర్లకు సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మిక హక్కులను కాలరాస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు. అనేక సంవత్సరాల నుండి కార్మికుల సంక్షేమం కోసం వారి హక్కుల సాధన కోసం పోరాటాలు వల్ల కార్మిక చట్టాలను రూపొందించుకొని హక్కులు సాధించుకున్నామని వారన్నారు. ఆ హక్కులను మళ్లీ తిరగరాస్తూ 28 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా కుదించి కార్మిక హక్కులను హరించే వేసే విధంగా నేటి బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారన్నారు . ఒకవైపు ధరలు 400 శాతం పెరిగాయని అందుకు అనుగుణంగా కాంట్రాక్టు కార్మిక వేతనాలు రోజు రోజుకు దిగజారిపోయి బానిస బతుకుల్లాగా తయారయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు శక్తి పడిపోయి బ్రతుకు బండి లాగ లేని స్థితికి దిగజారిన కార్మిక వర్గం ఒక్క తాటిపైకి వచ్చి మే 20న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మల్లెల రామనాథం,భూక్య రమేష్, పెద్దబోయిన సతీష్, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.







