రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
‘భూభారతి’ రెవెన్యూ సదస్సులను సమర్ధవంతంగా నిర్వహించాలి కలెక్టర్ సి. నారాయణ రెడ్డి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం కింద భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు వీలుగా జూన్ నేటి నుండి అన్ని మండలాలలో గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.
సోమవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇప్పటికే పైలెట్ ప్రాతిపాదికన జిల్లాలోని కొందుర్గు మండలంలో గల గ్రామాలలో రెవెన్యూ సదస్సులను జరిపి, క్షేత్రస్థాయి విచారణ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదే తరహాలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించాలని అన్నారు. జూన్ 03 నుండి 20 వ తేదీ లోపు రెవెన్యూ సదస్సులను విజయవంతంగా పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రతిరోజూ ఉదయం 9.00 గంటలకు సదస్సులు ప్రారంభం కావాలని, సాయంత్రం వరకు అందుబాటులో ఉంటూ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. నిర్ణీత షెడ్యూల్ ను అనుసరిస్తూ రెవెన్యూ బృందాలు సకాలంలో గ్రామాలకు చేరుకోవాలని, సదస్సుల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఒకటి, రెండు రోజుల ముందే ఆ ప్రాంత రైతులు, ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే చోట తాగునీరు, సరిపడా కుర్చీలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం కౌంటర్ ఏర్పాటు చేయాలని, దరఖాస్తుదారులకు సహకరించేలా హెల్ప్ డెస్క్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా దరఖాస్తులు దాఖలు చేసేలా చూడాలని, రిజిస్టర్లలో సమగ్ర వివరాలను నమోదు చేస్తూ, పూర్తి డాటాను కంప్యూటర్ ఆన్లైన్ లోనూ పొందుపర్చాలని ఆదేశించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలని, మొక్కుబడిగా కాకుండా ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, భూభారతిలోని నిబంధనలపై పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉన్నప్పుడే, తప్పిదాలకు తావులేకుండా దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించగల్గుతారని తెలిపారు. ముందుగా డెస్క్ వర్క్ ద్వారా రెవెన్యూ రికార్డులతో దరఖాస్తులోని వివరాలను సమగ్రంగా పరిశీలన చేసుకోవాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ జరపాలన్నారు.
ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా, విచారణ ప్రక్రియను పూర్తి నిబద్ధత, నిజాయితీగా నిర్వహించాలని సూచించారు. అవకతవకలకు తావు కల్పిస్తే ప్రభుత్వ యంత్రాంగానికి, రెవెన్యూ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా భూభారతి దరఖాస్తుల విచారణలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు. సంబంధిత అధికారులు ఎవరైన కావాలని పొరపాట్ల చేస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని, సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థను అమలు చేస్తున్నందున, ప్రతి దరఖాస్తును ఎంతో జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుందని, దరఖాస్తుదారుడు తిరిగి అప్పీలుకు వెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాకుండా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ జరిపి వాస్తవ పరిస్థితులతో కూడిన అభిప్రాయాలను నివేదికలో పేర్కొనాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ ప్రక్రియలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరు సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. సాదాబైనామాలు, పీ.ఓ.టీ దరఖాస్తులకు సంబంధించి రికార్డుల పరిశీలన, ప్రభుత్వం వెలువరించే మార్గదర్శకాలకు అనుసరిస్తూ సాదాబైనామా, పీ.ఓ.టీలను క్రమబద్దీకరించడం జరుగుతుందని దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒకే దరఖాస్తులో ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలను పొందుపరిస్తే, ప్రతి సమస్యను తప్పనిసరిగా పరిశీలిస్తూ వేర్వేరుగా విచారణ జరపాలని అన్నారు. ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను పరిరక్షించాలని అన్నారు. రెవెన్యూ సదస్సులు రైతులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహించాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు సూచించారు.







