మహా: బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది బీఆర్ఎస్ పార్టీ కాదని, డీఆర్ఎస్ దెయ్యాల రాష్ట్ర సమితి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దయ్యాలు ఉన్నాయని బయటపెట్టినా ఆ దయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలేరు నియోజకవర్గంలో రూ. 1500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం తిరుమలాపూర్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మీద సీఎం విమర్శలు, సెటైర్లు సంధించారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాల విషయానికొస్తే.. ‘తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. యాదాద్రి పేరుని యాదగిరిగుట్టగా మార్చాం. తిరుమల మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి, టీటీడీ మాదిరిగా వైటీడీ ఏర్పాటు చేశాం. 60 కిలోల బంగారంతో ఆలయ గోపుర నిర్మాణం, కొండపై భక్తులు నిద్రించేలా, ఆటోలు నడిచేలా చేశాం. త్వరలో యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తాం. స్థానిక విద్యాసంస్థలను వర్సిటీ స్థాయికి తీసుకెళ్తాం.’ అని ప్రసంగంలో పేర్కొన్నారు. గంధమల్ల ప్రాజెక్టును గతంలో ఎందుకు పూర్తిచేయలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్, గత బీఆర్ఎస్ సర్కారుని నిలదీశారు.
బంగారు తెలంగాణ ముసుగులో..
ఎవరు అడ్డుపడినా మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామని, నల్గొండ రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతాం. దేశంలో సబర్మతి, గంగా నదులను ప్రక్షాళన చేయగలిగినప్పుడు, మూసీ నదిని ఎందుకు శుద్ధి చేయకూడదు?” అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాలతో పోటీ పడదని, టోక్యో, న్యూయార్క్ నగరాలతోనే పోటీ పడి అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. “బంగారు తెలంగాణ ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నవారా నన్ను ప్రశ్నించేది? వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పి అక్కడి ఇళ్లన్నీ కూలగొట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ఆ గ్రామాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారు. విద్యార్థులు, రైతులు, ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నారు” అని ఆయన ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుర్చీలో కూడా కూర్చున్నా..
రాష్ట్ర బడ్జెట్ రూ.20 లక్షల కోట్లు ఉంటే, కేవలం రూ.2 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన ఎస్సెల్బీసీ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. యాదగిరిగుట్టలో అపచారాలకు పాల్పడినందుకే బీఆర్ఎస్ పరిస్థితి ఇలా తయారైంది. మీరు చేసిన పాపాల వల్లే ఈ దుస్థితి వచ్చింది” అని సీఎం అన్నారు. తమ పార్టీలో దెయ్యాలు చేరాయని ఆ పార్టీ నాయకురాలే స్వయంగా చెప్పారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దెయ్యాల నేత ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారు. బీఆర్ఎస్ కాదు.. అది డీఆర్ఎస్.. అంటే దెయ్యాల రాజ్య సమితి. ఈ కొరివి దెయ్యాలను తరిమికొట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఇందుకు పార్టీ కార్యకర్తల పూర్తి సహకారం కావాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తనను జైలుకు పంపిన వారిని గద్దె దించుతానని శపథం చేశానని, ఆ విధంగా తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఇతర కోరికలేమీ లేవని, నన్ను జైలుకు పంపిన వ్యక్తిని పదవి నుంచి తొలగించాలనుకున్నానని తెలిపారు. పట్టుదలతో వారిని గద్దె దించడమే కాకుండా ఆ కుర్చీలో కూడా కూర్చున్నానని, నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని పేర్కొన్నారు. ఇకపై మీ (ప్రజలు) లక్ష్యాలను నెరవేర్చడానికే ఒక సోదరుడిగా కష్టపడతానని, నన్ను జైల్లో పెట్టిన వ్యక్తిని పడగొడతానని జైలు నుంచి బయటకు వచ్చిన రోజే తొడగొట్టి చెప్పాను అని గుర్తు చేసుకున్నారు.
యాదగిరి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం..
యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు పిలుచుకునే యాదగిరిగుట్టగానే మార్చామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక తిరుమలలో ఎస్వీ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లుగానే యాదగిరిగుట్టలో కూడా యాదగిరి యూనివర్సిటీ ఏర్పాటు చేసి అభివృద్ది చేస్తామన్నారు. మెడికల్ , ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అన్నీ విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు. భక్తుల ఆశయాలకు తగినట్లుగానే ఆలయంలో పనులు చేపట్టామని యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆశీస్సులతో సంపూర్ణంగా అభివృద్ది చేస్తామన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
సీఎం శంకుస్థాపన పనుల వివరాలు:
రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన
రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానినికి శంకుస్థాపన
రూ.25.50 కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని వార్డులో వాటర్, డ్రైనేజీ, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం
రూ.7.50 కోట్లతో కొలనుపాక గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం
రూ.6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం
రూ.8.25 కోట్లతో మోటకొండూరు మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నిర్మాణం
రూ. 22.75 కోట్లతో దాతర్పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణం
రూ. 21.14 కోట్లతో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో బీటీ రోడ్ల నిర్మాణం
రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్ కమిటీలో 2500 మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణం








