ఆదిలాబాద్, మహా
తెలంగాణలో భూసర్వే జరిగి 70 సంవత్సరాలకుపైన అయిందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. భూ భారతి చట్టం భూ సమస్యలను పరిష్కరిస్తుందా అనే అంశంపై సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సోమవారం సెమినార్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూ సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షల కుటుంబాలు భూసమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు. భూముల ధరలు పెరగడంతో ఘర్షణలు జరుగుతున్నాయని, కోర్టులలో వచ్చే కేసుల్లో భూ వివాదాలే అధికంగా ఉన్నాయని అన్నారు. రెవిన్యూ సదస్సులలో దాదాపు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలో భూసర్వే జరిగి 70 సంవత్సరాలకుపైన అయిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని డిమాండ్ చేశారు. అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ బొప్పని పద్మ, పోచక్క, గంగారాం, ఆశన్న, సంతోష్, రామన్న, సిడాం మాధవరావు తదితరులు పాల్గొన్నారు.








